ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్‌ వెల్లడి

3 Nov, 2023 15:31 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా జాబ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. 

పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్‌ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది.

ఐటీ నియామకాల్లో 14% క్షీణత
నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్‌ కామ్‌ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది.

ఇతర నగరాల్లో వృద్ధి
కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం  కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి.

గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్‌ స్పీక్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

ఈ రంగాల్లో జోష్‌
ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్‌ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది.

మరిన్ని వార్తలు