‘అమ్మ’ గురించి ఆందోళన: నేత మృతి

5 Dec, 2016 15:11 IST|Sakshi
‘అమ్మ’ గురించి ఆందోళన: నేత మృతి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై టీవీలో వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురైన ఓ అన్నాడీఎంకే నాయకుడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన కడలూరి జిల్లాలో చోటు చేసుకుంది. కడలూరి జిల్లా గాంధీ నగర్ కు చెందిన నీలగండన్ అనే వ్యక్తి అన్నాడీఎంకేలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ఈ క్రమంలో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై టీవీ ఛానళ్లలో వస్తున్న వార్తలను చూసన నీలగండన్ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను 108లో హుటాహుటిన ఆస్పత్రికి తరిలించేందకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందారు. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
కాగా జయలలిత చికిత్స పొందుతున్న అపోలో హాస్పటిల్ వద్ద ఆదివారం సాయంత్రం నుంచే భారీ ఎత్తున అభిమానులు, నాయకులు చేరుకున్నారు. అమ్మకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు చెన్నైకి దారితీసే అన్నిమార్గాలలోనూ భారీగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి అన్నాడిఎంకే శ్రేణులను అడ్డుకుంటున్నారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమ్మ కోసం ప్రార్థనలు, పూజల్లో నిమగ్నమయ్యారు. 
మరిన్ని వార్తలు