ఎన్నికలకు కళ

8 Nov, 2023 02:17 IST|Sakshi

సంప్రదాయ కళలకు ఇప్పటికీ తగ్గని ఆదరణ 

రాజకీయ ప్రచారంలో  ఆకట్టుకునేలా నృత్యాలు, కళారూపాలు 

ఎన్నికల సీజన్‌లో కళాకారులకు  డిమాండ్‌ 

రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్‌ మీడియా కీలకంగా మారింది. ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌ మొదలు ఇన్‌స్టాగ్రామ్‌ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్‌లో ఆయా కళాకారులకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటోంది. 

సోషల్‌ జమానా 
ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్‌ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి పాపులర్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్‌ చేస్తున్నారు.

తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్‌ లెవల్‌ వరకు సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. 

ర్యాలీలు, సభల్లో...
బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 

కొమ్ము కోయ.. 
రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు.
 
అలరిస్తున్న గుస్సాడీ.. 
ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

బంజారా నృత్యం 
తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్‌బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 

డప్పు బృందాలు 
ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు  ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి.  

- తాండ్ర కృష్ణ గోవింద్‌

మరిన్ని వార్తలు