కనుమ సందడి

17 Jan, 2015 03:48 IST|Sakshi
కనుమ సందడి

తమిళనాట శుక్రవారం కనుమ పండుగ సందడి నెలకొంది. గ్రామగ్రామాన మూగజీవాలను పూజించారు. శనివారం కానం పొంగల్ సందర్భంగా జన సందోహం పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుంది. దీంతో చెన్నైని నీఘా నీడలోకి తెచ్చారు. మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు.
 
  సాక్షి, చెన్నై:  సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు శుక్రవారం కనుమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న పశువులను రైతులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆశ్రమాల్లో, గో మందిరాల్లో ఉదయాన్నే గోమాతలకు స్నానాలు చేయిం చారు. కొమ్ములకు కొత్త రంగులు వేశారు.

వివిధ రంగులు, బెలూన్లు, గజ్జెలతో అలంకరించారు. పండ్లు నైవేద్యంగా సమర్పించారు. చెన్నై మెరీనా తీరంలోకి తమ పశువుల్ని పెంపకదారులు తోలుకు వచ్చారు. వాటికి సముద్ర స్నానం చేయించిన అనంతరం పూజలు నిర్వహించారు. ఎడ్ల బండ్లతో పురవీధుల్లో చక్కర్లు కొట్టారు. జనానికి వినోదాన్ని పంచి పెట్టారు. పెద్ద పండుగలో మూడు ముఖ్య ఘట్టాలు ముగిశా యి. ఇక చివరగా కానం పొంగళ్ శనివారం ఘనంగా జరగనుంది.

 నేడు కానం పొంగల్
 కానం పొంగల్ అంటే అందరికీ మహదానందం. ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. వీరి కోసం పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాలు ముస్తాబ య్యాయి. ఒక్క చెన్నై నగరంలో రెండు వందల ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు నగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఆయా మార్గాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. జనం అత్యధికంగా తరలివచ్చే మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాన్ని నిషేధించారు.

 సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని రక్షించేందుకు, జేబు దొంగల భరతం పట్టేం దుకు ప్రత్యేకంగా మఫ్టీలో సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. అదే విధంగా చెన్నై నగరంలోని గిండి చిల్డ్రన్స్ పార్కు, వండలూరు జూ తదితర ప్రాంతాలు పర్యాటకుల కోసం ముస్తాబయ్యాయి. జనం నగరంలోని పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుండడంతో భద్రత నిమిత్తం 18 వేల మందిని రంగంలోకి దించారు. అలాగే ప్రత్యేక మొబైల్ టీమ్‌లను సైతం ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు