అయ్యో... భయపడినట్టుగానే జరిగింది

25 Apr, 2017 08:34 IST|Sakshi
అయ్యో... భయపడినట్టుగానే జరిగింది

కర్ణాటకలో బోరు బావిలో పడిన చిన్నారి కావేరి మృతి
బోరు బావిలో నుంచి మృతదేహం వెలికితీత


బళ్లారి: భయపడినంత అయింది. చిన్నారి కావేరి చనిపోయింది. మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఆమెను కాపాడలేకపోయాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి తాలూకా జుంజరవాడిలో బోరు బావిలో పడిన ఆరేళ్ల చిన్నారి కావేరి మృతి చెందింది. చిన్నారిని ప్రాణాలతో కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు ఫలించలేదు. ఆమె మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున వెలికితీశారు.

ఆడుకుంటూ ఈ నెల 22న నిరుపయోగంగా ఉన్న బోరు బావిలో కావేరి పడిపోయింది. 30 అడుగుల లోతులో చిక్కకుపోయిన ఆమెను ప్రాణాలతో రక్షించేందుకు జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముమ్మరంగా శ్రమించారు. భారీ పొక్లెయినర్లతో బోర్‌కు సమాంతరంగా తవ్వారు. దాదాపు మూడు రోజుల నుంచి మంచి నీరు లేకపోవడం, తీవ్రమైన ఎండల వల్ల పాప చనిపోయింవుంటని భావిస్తున్నారు.

చిన్నారి బోరులో పడిపోయినప్పటి నుంచి తల్లిదండ్రులు తిండి తిప్పల్లేకుండా గడిపారు. తల్లి సవిత నీరసించడంతో ఆస్పత్రిలో చేర్చారు. బోరు బావిని తవ్వి మూసివేయకుండా వదిలేసిన రైతు శంకర్‌ పరారీలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన భూమి యజమాని, బోర్‌వెల్‌ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు