‘సూట్‌కేసులు’ మోస్తున్నారు !

16 Jul, 2016 03:15 IST|Sakshi

సీఎం సిద్ధరామయ్య, మంత్రి జార్జ్‌పై కుమారస్వామి విమర్శలు
 
 బెంగళూరు: ‘సీఎం సిద్ధరామయ్య, మంత్రి కె.జె.జార్జ్‌లు హైకమాండ్‌కు కప్పాలు కడుతున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళుతూ హైకమాండ్‌కు సూట్‌కేసులు మోస్తున్నారు’ అని జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి కె.జె.జార్జ్ కంటే ముందు సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం సూట్‌కేస్‌ల ప్రభుత్వమని నేను చెప్పడం కాదు, ఏకంగా ఈ ప్రభుత్వంలో పనిచేసి ఇటీవలే మంత్రి పదవి పోగొట్టుకున్న శ్రీనివాస ప్రసాద్ అన్న మాటలివి. ప్రతి నెలా సిద్ధరామయ్య, కె.జె.జార్జ్‌లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు కప్పాలు కట్టి వస్తున్నారు’ అని మండిపడ్డారు.


ఇక ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని నిజాయితీ పరులైన అధికారులకు రక్షణ ఇవ్వలేకపోతోందని విమర్శించారు. దళితురాలైన ఓ జిల్లాధికారికే (మైసూరు కలెక్టర్ శిఖా) ఈ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేక పోయిందంటే, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని కుమారస్వామి ప్రశ్నించారు. ఇక మైసూరు కలెక్టర్ శిఖాపై బెదిరింపులకు పాల్పడిన సీఎం సిద్ధరామయ్య ఆప్తుడు మరిగౌడపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వస్తోందని కుమారస్వామి మండిపడ్డారు.
 
 

మరిన్ని వార్తలు