మహిళపై మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే

10 Nov, 2016 09:18 IST|Sakshi
ఎమ్మెల్యేతో సమస్యలపై వాగ్వాదం చేస్తున్న వరలక్ష్మి.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి
  • జనావాసాల మధ్య సెల్‌టవర్‌ వద్దనడమే ఆమె చేసిన పాపం
  • ఇక్కడ్నుంచి పోతావా? పోవా? అంటూ ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం
  • విశాఖ నగరంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో నిర్వాకం

  • ఆరిలోవ(విశాఖ): జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌ వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని తమ వద్దకు వచ్చిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి విన్నవించడమే ఆమె చేసిన పాపం. దీంతో నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ప్రజాప్రతినిధి చేతిలో ఉన్న మైకును ఆమెపైకి విసిరేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామంటూ టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని మూడో వార్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

    టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రవీంద్రనగర్‌ ఆఖరి బస్‌స్టాప్‌ వద్ద అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించటానికే వచ్చానని, టీడీపీ పాలనలో ప్రజాసమస్యలు తీరుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన మాకిన వరలక్ష్మి అనే మహిళతోపాటు స్థానికులు కొందరు ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

    సెల్‌టవర్‌ వల్ల సమస్యలెదురవుతాయని గతంలో ఇక్కడి మహిళలంతా ఉద్యమాలు చేసి ఎత్తివేయించామని, అయితే ఇక్కడ ఇటీవల కొత్తగా మరో సెల్‌ టవర్‌ను మీ అండతో ఏర్పాటు చేశారని చెప్పడంతో ఆ మహిళపై ఎమ్మెల్యే ఊగిపోయారు. ఆ సెల్‌టవర్‌ పెట్టింది వేరే పార్టీ కార్యకర్త.. నేనెందుకు మద్దతు పలుకుతాను.. నీవు ఇక్కడ నుంచి పోతావా పోవా.. అంటూ చేతిలో ఉన్న మైక్‌ను విసిరేశారు.

    అయినప్పటికీ ఆ మహిళ వెనుదిరగకుండా.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడికొచ్చారు.. అందుకే సమస్యలు చెప్పుకొంటున్నాం. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే పొమ్మని చెప్పండి.. మా వద్దకు వచ్చి మమ్మల్ని పొమ్మంటారా.. అంటూ ఎదురుతిరిగింది. దీంతో ఎమ్మెల్యే మరింత ఊగిపోయారు. ఆమెను తీసుకుపోండంటూ కార్యకర్తలను గద్దించారు. మధ్యలోనే యాత్రను ముగించేసి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేనే  నిలదీస్తావా? అంటూ వరలక్ష్మితో వాగ్వాదానికి దిగారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు