ముందుచూపున్నా.. మెప్పించలేదు

2 Nov, 2014 23:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి ముందుచూపు కలిగిన నాయకుడని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆయన పనితీరు తనకు నచ్చలేదన్నారు. నగరంలో ఆదివారం ఓ ఆంగ్ల ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ‘మోదీ ప్రభావం చూపారా లేదా అనే అంశంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుంది. ఆయన అత్యంత విశ్వాసంగా, ధీమాగా కనిపిస్తారు. అలా కనిపించడం ఆయనకు అత్యంత సహజం. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలిసారిగా బీజేపీ తనంతట తానుగా అధికారంలోకి వచ్చింది. మోదీకి ముందుచూపుందనే మాట వాస్తవమే.
 
 అయితే అది ఆచరణలోకి రావాల్సి ఉంది. అభివృద్ధి పథకాలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చకచకా ప్రకటిస్తోంది. రోజుకొకటిగానీ లేదా రెండురోజులకొకటిచొప్పునగానీ ప్రభుత్వం ముందుకొస్తోంది. ఆ పని మేమూ చేశాం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘అచ్చే దిన్ ఆయేంగే’ ఇది జరుగుతుంది. మార్పులు కూడా సంభవమే. ఉన్నతాధికారులు చకచకా పనిచేస్తున్నారు. అవినీతి కనిపించలేదు’ అని అన్నారు. ఏదైనా చేయాలంటే అందుకు కొంత సమయం పడుతుంది. గత ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు’అని అన్నారు. గవర్నర్ పదవి అనేది రాజకీయాలకు అతీత మైనదన్నారు. ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగబోనన్నారు. అందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించినట్టు ఇటీవల వార్తలొచ్చిన సం గతి విదితమే. దీనిపై అడిగిన ప్రశ్నలకు ఆమె పైవిధంగా స్పందించారు.
 

మరిన్ని వార్తలు