ముంబైలో తెలంగాణ భవన్

12 Feb, 2015 05:30 IST|Sakshi
ముంబైలో తెలంగాణ భవన్

టీఆర్‌ఎస్ ఎంపీ కవిత హామీ
* ఘనంగా పద్మశాలి సంఘం పసుపు కుంకుమ
సాక్షి, ముంబై: ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని టీఆర్‌ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ముంబై ప్రభాదేవిలోని రవీంద్ర నాట్యమందిర్ హాల్‌లో బుధవారం రాత్రి జరిగిన ‘ఓం పద్మ శాలి సేవా సంఘం’ పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ వలసవచ్చిన తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం భేటీ కానున్నారు. ఆ సమయంలో తెలంగాణ భవనం అంశాన్ని గూర్చి మాట్లాడాలని తాను సీఎం కేసీఆర్ కార్యాలయానికి ఫోన్ చేసి సూచించినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో మహారాష్ట్ర భవనం కోసం తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇచ్చిందని గుర్తు చేశారు. అందువల్ల ముంబైలో కూడా తెలంగాణ భవనం కోసం స్థలం లభించగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. వలసబిడ్డలు స్వగ్రామలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నారు. అదే విధంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు నేరుగా ముంబై నుంచి బస్సులను నడిపే విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటామని కవిత చెప్పారు.
 
తెలుగు భవనానికి సహకరిస్తాం: సునీల్ శిందే..
తెలుగు భవనం ఏర్పాటుకు తాము కూడా సహకరిస్తామని శివసేన ఎమ్మెల్యే సునీల్ శిందే చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత సూచన మేరకు తాను కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ రాస్తానని అన్నా రు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.
 
ఘనంగా పసుపు-కుంకుమ
ఓం పద్మశాలి సేవా సంఘం పసుపు-కుంకుమ కార్యక్రమం, సంస్థ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన ‘ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఆఫ్ అభినయ నృత్య బృందం’ వారు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జానపద గేయాలతో పాటు నృత్య ప్రదర్శనలతో కళాకారులు మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకురాలైన కవిత, శివసేన ఎమ్మెల్యే సునీల్ శిందే, నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, మోర్తాడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ నూకల విజయ్‌కుమార్‌లను ఆ సంస్థ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, కార్యవర్గ సభ్యులు శాలువాకప్పి సత్కరించారు.
 
ఉత్తమసేవలందించిన వారికి నవరత్నాల బిరుదు
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన తొమ్మిది మందిని ఎంపికచేసి వారికి నవరత్నాలుగా బిరుదు ఇచ్చి సత్కరించారు. ఈ బిరుదులు అందుకున్న వారిలో సాహిత్యంలో సంగెవేణి రవీంద్ర, భవన నిర్మాణ రంగంలో నాగేంద్ర దేవానంద్, ఆర్థికరంగంలో సీఎ అశోక్ రాజ్‌గిరి, క్రీడా రంగంలో సంగం జనార్దన్, వైద్య రంగంలో డాక్టర్ దంతాల పురుషోత్తం, హెరిటేజ్ భవన పరిరక్షణ రంగంలో సుల్గే శ్రీనివాస్, సామాజిక రంగంలో కోడూరి శ్రీనివాస్, విద్యా రంగంలో భవిత పెంట, ఆథ్యాత్మిక సామాజిక రంగంలో కె హనుమంతురావులున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆంధ్రమహాసభ ట్రస్టీ చైర్మన్ ఏక్‌నాథ్ సంగం, అధ్యక్షులు సంకు సుధాకర్, ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సెవై రాములు, రేణుక సంగం తదితరులతోపాటు ఓం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పోతురాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ, ఉపాధ్యక్షులు అంబల్ల గోవర్ధన్, చౌటీ నారాయణ్ దాస్, చాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు