బల నిరూపణ కోరండి: నితీశ్ | Sakshi
Sakshi News home page

బల నిరూపణ కోరండి: నితీశ్

Published Thu, Feb 12 2015 4:56 AM

బల నిరూపణ కోరండి: నితీశ్

  • మాంఝీ విశ్వాస పరీక్షకు డిమాండ్
  • 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి భవన్‌లో పరేడ్
  • ప్రణబ్‌కు బిహార్ పరిస్థితిని వివరించిన జేడీయూ నేత
  • న్యూఢిల్లీ: బిహార్ రాజకీయ పంచాయతీ రాష్ట్రపతి ముందుకు చేరింది. జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు. వీరిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో వేచి ఉండగా, నితీశ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని బిహార్ పరిస్థితిని వివరించారు. జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు లాలూ ప్రసాద్, ములాయం సింగ్, కాంగ్రెస్ నేత సీపీ జోషీలను వెంటబెట్టుకుని నితీశ్ రాష్ర్టపతిని కలిశారు.

    అనంతరం విలేకర్లతో మాట్లాడారు. బిహార్ సీఎం జితన్ రాం మాంఝీని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆదేశించాలని కోరారు. ‘గవర్నర్ బలనిరూపణకు ఆదేశంపై జాప్యం చేస్తున్నారు. పరిస్థితిని చెడగొడుతున్నారు. బేరసారాలను ప్రోత్సహిస్తున్నారు’ అని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను పిలవాలని డిమాండ్ చేస్తూ వస్తున్న నితీశ్.. జేడీయూ ఎల్పీ నేతగా తన ఎన్నికపై పట్నా హైకోర్టు బుధవారం స్టే విధించడంతో వ్యూహం మార్చారు.

    ‘మాంఝీ బలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉంటే గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ ఆయనను బలనిరూపణ చేసుకోవాలని అడగాలి. అయితే సీఎంకు అతితక్కువ గడువు ఇవ్వాలి’ అని అన్నారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రపతి ఎలా స్పందించారని అడగ్గా, ఆయన తాము చెప్పినవన్నీ విన్నారని, విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారన్నారు. ‘మేం పట్నాలో 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ చేశాం. వారు ఈ రోజూ నా పక్కన ఉన్నారు.

    మెజారిటీ ఎక్కడుందో స్పష్టంగా చూడొచ్చు. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం చూపకపోవడం అన్యాయం. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవడం. అసెంబ్లీలో ఐదు పార్టీలకే ప్రాతినిధ్యం ఉంది. అందులో నాలుగు ఒకేతాటిపై ఉన్నాయి. బీజేపీ ఒంటరి. రాష్ట్ర పరిస్థితిని చెడగొట్టి, గవర్నర్ పాలన విధించాలన్న వారి కుట్రకు ఈ జాప్యం నిదర్శనం’ అన్నారు.
     
    నితీశ్ ఎన్నికపై హైకోర్టు స్టే: బిహార్ సీఎం పదవికి పోటీ పడుతున్న నితీశ్ కుమార్‌కు పట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర జేడీయూ శాసనసభాపక్ష(ఎల్పీ) నేతగా ఆయన ఎన్నికపై హైకోర్టు స్టే బుధవారం విధించింది. నితీశ్‌ను జేడీయూ ఎల్పీ నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి జారీ చేసిన లేఖ సంబంధించి న్యాయపరమైన చిక్కులను పరిశీలించాలనుకుంటున్నామని కోర్టు పేర్కొంది.

    గవర్నర్ తీసుకోబోయే నిర్ణయానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇది అవసరమని చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, జస్టిస్ వికాస్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. దీనిపై  వచ్చే బుధవారం తిరిగి విచారణ జరుపుతామని తెలిపింది. శనివారం జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఏర్పాటు చేసిన పార్టీ ఎల్పీ భేటీలో సీఎం జితన్ రాం మాంఝీ స్థానంలో నితీశ్‌ను జేడీయూ ఎల్పీగా నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. ఈ భేటీ చట్టవిరుద్ధమని మాంఝికి మద్దతిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రాజ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు విచారించి పై ఆదేశాలు జారీ చేసింది.
     
    20న బల నిరూపణ


    పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఫిబ్రవరి 20న అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ బుధవారం రాత్రి ఆ రాష్ట్ర గవర్నరు కేసరి నాథ్ త్రిపాఠీ ఆదేశించారు. బిహార్ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన రోజున గవర్నరు ప్రసంగం ముగిసిన వెంటనే మాంఝీ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, రహస్య బ్యాలెట్ నిర్వహించాలన్న మాంఝీ విజ్ఞప్తికి గవర్నరు అంగీకరించారా, లేదా అన్నది వెల్లడి కాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement