నళిని, ప్రియాంకల మధ్య ఏం జరిగింది!

12 Dec, 2016 15:01 IST|Sakshi
నళిని, ప్రియాంకల మధ్య ఏం జరిగింది!
- పుస్తకంలో ఆ రోజు ఘటన  పాతి పెట్టిన నిజాలు 
- పుస్తకం రూపంలో ‘నళిని’ మనో వేదన 
 
సాక్షి, చెన్నై : ‘‘ తనను చూడటానికి ప్రియాంకా వచ్చారు...తాము  నిర్ధోషులం అని వ్యాఖ్యానించగానే, ఒక్క సారిగా ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది...తీవ్రంగానే  ఆక్రోశం..ఒక్క క్షణం నాలో   కలవరం...! అంతలో నీ గురించి మాత్రం మాట్లాడూ’’ అని ఆమె అన్న మాటలు నేటికి తనకు బాగానే గుర్తున్నాయని రాజీవ్ హత్య కేసు నింధితురాలు నళిని తన పుస్తకంలో  వివరించి ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం  ఆ  ఇద్దరి మధ్య ఏలాంటి సంభాషణలు జరిగాయో అని ఎదురు చూస్తున్న వాళ్లకు గురువారం విడుదల కాబోతున్న నళిని ‘పాతి పెట్టిన నిజాలు’ పుస్తకం తేట తెల్లం చేయబోతున్నది. 
 
మాజీ ప్రధాని రాజీవ్ గాంధి హత్య కేసులో నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లతో పాటుగా ఏడుగురిని సిబీఐ సమర్పించిన ఆధారాలతో  దోషులుగా కోర్టు  తేల్చిన విషయం తెలిసిందే. వీళ్లందరికీ తొలుత ఉరి శిక్ష పడ్డాయి. 2008లో హఠాత్తుగా రాజీవ్ గాంధి తనయ ప్రియాంక వేలూరు జైల్లో ప్రత్యక్షం కావడంతోప్రాధాన్యత సంతరించుకున్నది. తన తండ్రిని హతమార్చిన దోషుల్లో ఒకరిగా జైల్లో ఉన్న నళినితో ఆమె సంప్రదింపులు సాగినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అన్నది నేటికీ ప్రశ్నార్థకమే. ప్రియాంక సంప్రదింపు తదుపరి నళిని ఉరి శిక్ష కాస్త యావజ్జీవానికి మారింది. 
 
తదుపరి సాగిన పరిణామాలతో మిగిలిన వారి ఉరి శిక్షలు యావజ్జీవాలుగా మారిన విషయం తెలిసిందే. అయితే, నళని, ప్రియాంకల మధ్య అస్సలు ఏం జరిగింది, ఎలాంటి సంభాషణలు సాగాయె అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్న వాళ్లకు పుస్తకం రూపంలో నళిని సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఆరు వందల పేజిలతో కూడిన ఈ పుస్తకం గురువారం  ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో నళిని - ప్రియాంకల మధ్య సాగిన సంభాషణలు, తమ మీద సిబిఐ మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా ప్రశ్నలు, నిర్ధోషులుగా చాటుకునేందుకు తగ్గట్టుగా అనేక అంశాలను పొందు పరిచినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.
 
 అదే సమయంలో 2008లో తమ ఇద్దరి మధ్య  ఏమి జరిగిందో..? అన్న వివరాలు  ఆ పుస్తకం ద్వారా నళిని వివరించిన కొన్ని సంభాషణలు  బుధవారం ఓ మీడియాకు చేరింది. {పియాంక ఆగ్రహం : 2008లో ప్రియాంక తనను చూడటానికి వచ్చినట్టు సమాచారం రాగానే, ఆమె దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టుగా ఆ పుస్తకంలో వివరించారు. ఆ మేరకు ఆమెతో మాట్లాడే సమయంలో , సిబిఐ తమ మీద అబాండాలు మోపినట్టు వివరించినట్టు పేర్కొని ఉన్నారు. ఎల్‌టీటీఈ నిబంధనల మేరకు పురుషులకు 26, స్త్రీలకు 21 ఏళ్లు వచ్చినప్పుడే వివాహం చేసుకోవాలని పేర్కొన బడి ఉన్నట్టు గుర్తు చేశానని సూచించారు. అయితే, 21 ఏళ్ల వయస్సు గల మురుగన్‌తో అప్పటికే తనకు వివాహం జరిగిందని పేర్కొని ఉన్నారు. 
 
నిబంధనల్ని ఉల్లంఘించి వివాహం చేసుకుంటే, శిక్షలు కఠినంగానే ఎల్‌టీటీఈలో ఉంటాయని ,  అలాంటప్పుడు తాము ఎలా ఆ సంస్థకు చెందిన వారిమో అని ప్రశ్నించినట్టు వివరించి ఉన్నారు. సంఘటన జరిగిన రోజున తాను పనిచేస్తున్న ప్రైవేటు సంస్థలోనే ఉన్నానని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు పేర్కొని ఉన్నారు. ప్యారీస్ నుంచి తానేదో మానవ బాంబుగా మారి రద్దీగా ఉన్న బస్సులో వెళ్లినట్టుగా సీబీఐ అభియోగాలు మోపి ఉన్నదని, రద్దీ గా ఉన్న బస్సులో బాంబుల్ని కట్టుకుని వెళ్లి ఉంటే, ఎవ్వరో ఒకరు గుర్తించ కుండా ఉండి ఉంటారా..? అని ప్రశ్నించినట్టు, మురుగన్‌ను ద్వితీయ శ్రేణి నాయకుడిగా చిత్రీకరించి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సూచించి ఉన్నారు. ఎల్‌టీటీఈలో ద్వితీయ శ్రేణి నాయకుడుగా తన భర్త ఉండి ఉంటే, సిబిఐ అరెస్టు చేసేలోపు వేదారణ్యం నుంచి పడవ ద్వారా ఎల్‌టీటీఈల వద్దకు చేరి ఉండే వాడు కాదా..? అని ప్రశ్నించినట్టు, అస్సలు తాము నిర్దోషులం అని,తమను అన్యాయంగా ఇరికించారని వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రియాంక తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు ఆ పుస్తకంలో వివరించి ఉన్నారు.
 
 ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసిన సమయంలో ఒక్క సారిగా తనలో కలవరం బయలు దేరిందని, అయితే, క్షణాల్లో ఆమె తనతో అన్న మాటలు ఊరట నిచ్చాయని పేర్కొని ఉన్నారు. ముందు నీ గురించి మాత్రం మాట్లాడు, మిగిలిన వారి గురించి వద్దంటూ ఆమె ఆగ్రహంగా అన్న మాటలు నేటికీ గుర్తున్నాయంటూ ఆ పుస్తకంలో నళిని స్పందించి ఉండటంతో, ఈ పుస్తకంలో పాతి పెట్టిన నిజాలు మరెన్ని ఉన్నాయో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉండటం గమనార్హం.
 
మరిన్ని వార్తలు