రాజధాని రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

3 Feb, 2017 14:31 IST|Sakshi
రాజధాని రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
గుంటూరు: రాజధాని ప్రాంతం అమరావతిలో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. వీటికి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కొత్తగా నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తుళ్ళూరులో ఏర్పాటు చేసిన అమరావతి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
అలాగే తుళ్లూరు, అనంతవరం, ఉండవల్లి, మందడంలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు చట్టం రూపొందిస్తున్నామని, ప్రతి డాక్యుమెంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ల పరంగా మున్ముందు ఎలాంటి వివాదాలకు తావుండకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు హాజరయ్యారు.
మరిన్ని వార్తలు