డెంగీతో పది నెలల చిన్నారి మృతి

25 Oct, 2016 03:36 IST|Sakshi
డెంగీతో మృతి చెందిన పది నెలల బాలుడు జోసెఫ్

16కు పెరిగిన డెంగీ మృతుల సంఖ్య
వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు

 తిరుత్తణి: డెంగీ జ్వరానికి తిరుపతికి చెందిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తిరువళ్లూరు జిల్లాలో మాత్రం డెంగీ  మృతుల సంఖ్య 16కు చేరింది. తిరువళ్లూరు జిల్లాలో రెండు నెలలకు పైబడిన విష జ్వరాలు వ్యాప్తి చెందిన  వందలాది మంది ఆసుత్రుల్లో చేరి చికిత్స పొందారు. వీరిలో చిన్నారులకు జ్వరం అధిగమించి తిరువాలాంగాడు యూనియన్ కావేరిరాజపురం ఆది ఆంధ్రవాడకు చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో డెంగీ  బెంగ పట్టుకుంది. అదే సమయంలో  తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట సహా అనేక గ్రామాల్లో  ప్రజలకు విష జ్వరాలు సోకడంతో తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై ప్రభుత్వాసుపత్రుల్లో విష జ్వరాల బాధితుల సంఖ్య  వందల సంఖ్యలో పెరిగింది.

ఆలస్యంగా  మేల్కొన్న ప్రభుత్వం
విష జ్వరాలు  వేగంగా వ్యాప్తి చెంది చిన్నారులు వరుస క్రమంలో ప్రాణాలు కోల్పోవడంతో మృతులకు వైరస్ జ్వరాలు మాత్రమేనని, డెంగీ కాదని ప్రభుత్వం  ప్రకటించుకుంది. గ్రామాల్లో పరిశుభ్రత పనులు వేగవంతం చేశారు. అదే సమయంలో వైద్య బృందాలను, సంచార వాహనాల బృందాలను రంగంలోకి దింపి  ఆరోగ్య వైద్య సేవలు విస్తృతం చేశారు. ప్రధానంగా  గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేస్తుండిన నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. 

మళ్లీ విజృంభించిన విష జ్వరాలు
పరిశుభ్రత, ఆరోగ్య సేవలను ఆలస్యం చేపట్టిన ప్రభుత్వం  ఆ పనులను  కొనసాగించడంలో మాత్రం  విఫలం కావడంతో కొద్ది రోజుల్లోనే  తిరుత్తణి పట్టణంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలో తిరుపతి అలమేలుమంగాపురం అంబేద్కర్ కాలనీకి చెందిన తిరుమూర్తి పది నెలల  కుమారుడు జోసెఫ్ విష జ్వరంతో తిరుపతిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. జ్వరం తగ్గక పోవడంతో తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేక పోవడంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం  జ్వరం పెరిగి  మృతి చెందాడు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 16కు పెరిగింది. వైద్యులు  పూర్తి స్థాయిలో  వైద్య సేవలు చేపట్టక పోవడంతోపాటు  సకాలంలో వైద్యం చేయడంలో అలసత్వంతోనే  చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు బాధితులు వాపోయారు.

మరిన్ని వార్తలు