రాత్రి శిబిరాలు ఉచితం

30 Nov, 2014 22:30 IST|Sakshi

న్యూఢిల్లీ: నగరంలోని నిరాశ్రయులకు ఢిల్లీ అర్బన్‌షెల్టర్ బోర్డు ఓ శుభవార్తను ప్రకటించింది. ఈ శీతాకాలంలో నగరంలోని అన్ని నైట్‌షెల్టర్లలో నిరాశ్రయులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మార్చి 15వరకు తమ రాత్రి శిబిరాలలో ఉచితంగా బసచేయవచ్చని తెలిపింది. సాధారణంగా ప్రతి 24 గంటలకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వసూలు చేస్తారు.
 
 మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, మత్తుమందు బానిసలకు మాత్రం ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారు. కానీ ఈసారి తమ నైట్‌షెల్టర్లు అందరికీ ఉచితమని డీయూఎస్‌ఐబీ డెరైక్టర్ కమల్‌మల్హోత్రా బుధవారం చెప్పారు. ఈ శీతాకాలంలో ఎక్కడ ఉండాలన్న బెంగ నిరాశ్రయులకు అవసరం లేదని ఆయన అన్నారు. అణాకానీ లేనివారు కూడా వచ్చి ఈ షెల్టర్లలో బస చేయవచ్చని చెప్పారు. నిరాశ్రయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ఢిల్లీ అంతటా ప్రస్తుతం 184 నైట్ షెల్టర్లు ఉన్నాయి. కాగా డీయూఎస్‌ఐబీ మరో 16 షెల్టర్లను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది.
 
 ప్రజలు రోడ్లపై నివసించే నిరాశ్రయులకు బట్టలు, ఆహారం, డబ్బు, ఇతర సామగ్రిని నేరుగా ఇచ్చే బదులు, తమ సమీపంలోని నైట్‌షెల్టర్‌కు వాటిని విరాళంగా ఇవ్వాలని మల్హోత్రా పిలుపునిచ్చారు. తమ సమీపంలోని నైట్‌షెల్టర్‌ను కనుగొనేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయించవచ్చని సూచించారు. ఇంకా ఇబ్బంది ఎదురైతే తమకు ఫోన్ చేయవచ్చని డెరైక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిరాశ్రయులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించడం సవాలుగా మారవచ్చని మల్హోత్రా పేర్కొన్నారు. ఢిల్లీకి వలస వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఇలా ఆశ్రయం కోరే వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు