అట్టహాసంగా ఆంధ్ర కళాసమితి వార్షికోత్సవం

30 Dec, 2013 23:43 IST|Sakshi

 దాదర్, న్యూస్‌లైన్: నవీముంబై ప్రాంతంలోని పన్వెల్‌లోగల ఆంధ్ర కళాసమితి 23వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం సమితి ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు సమితి సభ్యులతోపాటు పట్టణంలోని ప్రముఖులు, అభిమానులు పెద్దపెట్టున తరలివచ్చారు. ఆహూతులకు సంయుక్త కార్యదర్శి సుజాత రావు, కార్య నిర్వాహక సభ్యుడు పి.అశ్విన్‌కుమార్ స్వాగతం పలికారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యులు సామంచి రామ్మూర్తి కవితలు అలరించగా జోక్స్ కితకితలు పెట్టాయి. కీ బోర్డ్‌పై మల్హర్ ఆలపించిన దేశభక్తి గీతం, అశ్విన్‌కుమార్, పద్మ దంపతులు ఆపించిన యుగళగీతం, ప్రతి భరణి, శ్రావ్యలు ఆలపించిన సినీ గీతాలు ఎంతగానో అలరించాయి.
 
 మహిళా సభ్యులు ఆలపించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ప్రార్థనాగీతం అనంతరం వేదికపై అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త  శ్రీకాంత్, తనూజ దంపతులు, గౌరవ అతిథులుగా డాక్టర్.ఎస్.గుణహరి (అసిస్టెంట్ లేబర్ కమిషనర్), సుధా గుణహరి, కె.వెంకటరమణ (సమితి అధ్యక్షులు), పి.సతీష్ రాజు (ప్రధాన కార్యదర్శి), ఈ.శంకర్ (కోశాధికారి) తదితరులు ఆశీనులయ్యారు. సమితి చేపట్టిన పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల గురించి ఉపాధ్యక్షుడు కే.ఎస్.ఆర్.కృష్ణ వివరించారు. జమాఖర్చుల వివరాలను ఈ.శంకర్ సభికులకు తెలిపారు. అతిథులను, సమితి ఉన్నతికి పాటుపడిన సంస్థాపక సభ్యులను, స్థానిక బాలాజీ మందిర్ పురోహితులను, పట్టణంలో ఇటీవలే జరిగిన ‘పన్వెల్ ఫెస్టివ్-ఆంధ్రప్రదేశ్ డే’లో పాల్గొన్న కళాకారులను శాలువా, మెమెంటో, పుష్పగుచ్చాలతో నిర్వాహకులు సత్కరించారు. పట్టణంలో నిర్వహించే సేవాకార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్న వెంకట్రామన్ దంపతులను సత్కరించారు. ప్రముఖ కవి, ముంబై ఆంధ్రసహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.మల్లికార్జునరెడ్డి, కె.నాగేశ్వర రావు తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం సంధ్య, శ్రావ్య బృందం భరత నాట్యం, బేబీ నేహా సినీ నృత్యం, చివరకు విందు భోజనాలతో ముగిసింది.
 

మరిన్ని వార్తలు