లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా!

12 Apr, 2020 06:28 IST|Sakshi
ఎదురు చూపుల్లో జనం

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ ఒకవైపు సత్ఫలితాలను ఇస్తుండగా మరోవైపు నిరాశ్రయులైన పేదలు నిస్సహాయులుగా మారిపోయారు. తలదాచుకునేందుకు గూడు, కడుపు నింపేందుకు కూడు, కట్టుకునేందుకు గుడ్డకు నోచుకోక తల్లడిల్లిపోతున్నారు. అయ్యా..బాబూ... ఆదుకోండని దయనీయంగా చేతులుచాచే జనంతో చెన్నై నగరంలోని ప్లాట్‌ఫారాలు నిండిపోతున్నాయి.

సాక్షి, చెన్నై: లాక్‌డౌన్‌ ఆంక్షలతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లలో జనసంచారం లేక బోసిపోయింది. రోడ్డువారగా, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్ల వద్ద పడిగాపులు కాస్తూ ప్రయాణికులు ఇచ్చి తినుబండారాలు, ఆహార పదార్థాలతోనే కడుపునింపుకునేవారు ఆకలితో అలమటిస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల ముందు కూర్చుని ప్రజలు వేసే భిక్షపైనే ఆధారపడి బతికే బీదాబిక్కీ జనానికి రోజు గడపడమే కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

వీరుగాక భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన జనం కూడా సొంతూళ్లకు వెళ్లలేక భిక్షగాళ్లలో చేరిపోయారు. నగరంలోని వంతెనల కింద ఉన్న నీడనే నివాసాలుగా మార్చుకుని అన్నమో రామచంద్రా అంటూ సుమారు 15 వేల మంది ఆకలి కేకలు పెడుతున్నారు. గూడు, గుడ్డ లేకున్నా సర్దుకుపోగలం... ఆకలి తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయమేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అత్యవసర వస్తువుల కొనుగోలును లాక్‌డౌన్‌ నుంచి మినహాయించడంతో కొద్ది సంఖ్యలో జనం రోడ్లపై సంచరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎదురుపడిన భిక్షగాళ్లకు చేతికందిన సాయం చేస్తున్నారు. అయితే ధన రూపేణా ఇచ్చే సహాయం వారికి ఎంతమాత్రం ఉపయోగపడడం లేదు. చదవండి: ఏప్రిల్‌ 30 దాకా.. లాక్‌డౌన్‌ పొడిగింపు.. 

చేతిలో డబ్బులున్నా సాయంత్రం వేళల్లో ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. డబ్బులొద్దు... తినేందుకు ఏమైనా ఉంటే ఇవ్వండని వేడుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. రెండురోజుల క్రితం నగరంలో జోరున వర్షం పడగా పూర్తిగా తడిచిపోవడం వారిని మరింత బాధపెట్టింది. ఆహారం సంగతి అటుంచి గొంతెడితే దాహం తీర్చుకునేందుకు సైతం వీలులేకుండా పోయింది. నిరాధారం, నిరాశ్రయంగా సంచరించేవారిలోని వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఆకలిదప్పులతో అడుగు తీసి అడు గువేయలేక మూసిఉన్న అంగళ్ల ముందు పడుకుని ఉండిపోతున్నారు.  

‘కుంభకోణం నా సొంతూరు. ఉపాధిని వెతుక్కుంటూ 40 ఏళ్ల క్రితం చెన్నైకి వచ్చి హార్డ్‌వేర్‌ షాపులో పనికి చేరాను. వృద్ధాప్యం మీదపడడంతో పని చేయలేక కోయంబేడు బస్‌స్టేషన్‌లో భిక్షగాడిగా మారిపోయి అక్కడే నివసిస్తున్నాను. లాక్‌డౌన్‌తో బస్‌స్టేషన్‌ మూసివేయడంతో చెన్నై మధురవాయల్‌లోని ఒక రేషన్‌షాపు ముందున్న నీడలో తలదాచుకుంటున్నాను. అన్నం దొరక్క అవస్థలు పడుతున్నా’ అని కరుప్పయ్య అనే 58 ఏళ్ల వృద్ధుడు కన్నీటిపర్యంతమయ్యాడు. వీరిపై చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కరుణచూపి కడుపు నింపాలని సంఘ సేవకులు కోరుతుండగా, ఎవరో వస్తారని..ఎదో చేస్తారని నిరాశ్రయులు ఎదురుచూస్తున్నారు.  చదవండి: 24 గంటల్లో 1035 కేసులు 

మరిన్ని వార్తలు