కూతురి సీమంతానికి వస్తానని..

30 Jun, 2019 22:17 IST|Sakshi
భౌతికకాయం వద్ద కుటుంబసభ్యుల రోదనలు (ఇన్‌సెట్‌) పాటిల్‌

యశవంతపుర :  ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల దాడిలో మరణించిన కలబురిగికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై మహదేవ్‌ పాటిల్‌ (50) అంత్యక్రియలు శనివారం సాయంత్రం స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జిల్లాలోని కమలాపుర తాలూకా మరగుత్తి గ్రామంలో అపార జనసందోహం కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ప్రత్యేక వాహనంలో ఆయన పార్థివదేహం గ్రామంలోకి రాగానే భారీసంఖ్యలో ప్రజలు జాతీయ పతాకం ఊపుతూ గౌరవం ప్రకటించారు. యువత బైక్‌ ర్యాలీతో అనుసరించారు. పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు పాటిల్‌ భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

ఒకటో తేదీన వస్తానని
మహదేవ్‌ పాటిల్‌ జూలై 1వ తేదీన కూతురి సీమంత వేడుకకు రావలసి ఉండగా, అంతలోనే విషాదం సంభవించింది. చత్తీస్‌గడ్‌లోని బిజాపుర జిల్లాలో మూడురోజుల కిందట నక్సలైట్ల దాడిలో పాటిల్‌ అమరుడయ్యారు. ఆయన హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్‌లో 15 ఏళ్లు నుంచి పనిచేస్తున్నారు.  మూడేళ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌కు బదిలీ అయ్యారు. ఆయనకు భార్య, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.    

>
మరిన్ని వార్తలు