కరెంట్ షాక్

24 Sep, 2014 00:02 IST|Sakshi
కరెంట్ షాక్

 చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏటా విద్యుత్ వినియోగంపై లాభనష్టాలను సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా 2014-15 నాటికి రూ.39,818 కోట్ల రాబడిని ఆశిస్తోంది. అయితే ప్రస్తుత చార్జీల తీరును బట్టి రూ.32,964 కోట్లు మాత్రమే లభించగలదని గుర్తించారు. అంటే రాబడిలో రూ.6,854 కోట్లను కోల్పోతున్నట్లు కమిషన్ అధికారులు గ్రహించారు. చార్జీలను సవరిస్తే రూ.6,805 కోట్లు లభించగలవని అంచనావేశారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి ఏడాది విద్యుత్ రెవెన్యూ పరిస్థితిని సమీక్షించి మార్గాలను అన్వేషించే అధికారం ఉన్నందున చార్జీల పెంపునకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈలెక్కన పారిశ్రామిక వాడలకు యూనిట్ రూ.5.50 నుంచి రూ.7.22, ప్రభుత్వ పర్యవేక్షణలోని విద్యాసంస్థలకు యూనిట్ రూ.4.50 నుంచి రూ.7.22లు, ప్రైవేటు విద్యాసంస్థలకు రూ.5.50 నుంచి 7.22కు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.7.00 నుంచి రూ.8.05, తాత్కాలిక వినియోగానికి రూ.9.50 నుండి రూ.11గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గృహ వినియోగంపై (రెండునెలల బిల్లు) రూ.2.60 నుండి రూ.3.00, గుడిసెలకు రూ.1.00 నుంచి రూ.1.20గా పెంచనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగాన్ని బట్టి యూనిట్ చార్జీల్లో పెరుగుదల ఉంటుంది.
 
 పెంచక తప్పని పరిస్థితి : సీఎం జయ
 విద్యుత్ ఉత్పత్తిపై పెరిగిన ఆర్థిక భారం దృష్ట్యా చార్జీలను సవరించిక తప్పడం లేదని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో విద్యుత్ చార్జీలు పెంచబోతున్నట్లు సూత్రప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 2011లో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాజీలేని పోరాటం సాగిస్తోందన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అనేక చర్యలను చేపట్టిందని చెప్పారు. ఈ మూడేళ్లలో 2,783 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను సాధించామని, 500 మెగావాట్ల కొనుగోలు చేశామని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా మొత్తం మీద 4,079 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను పొందగలిగామని చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కోసం రూ.10,575 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికోసం వినియోగించే ముడిపదార్థాల ధరలు పెరుగుదల పెనుభారంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు