ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు

7 May, 2015 03:51 IST|Sakshi
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చినట్లు

మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు బందోబస్తులోనే..
ఉగ్రదాడుల నేపథ్యంలోతీవ్ర బందోబస్తు.. వారాంతపు సెలవులూ బంద్
మానసిక ఒత్తిడికి గురవుతున్న రక్షక భటులు

సాక్షి, ముంబై: ఇండియన్ ప్రెమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌ల నగర పోలీసుల మీదకొచ్చి పడింది. క్రికెట్ స్టేడియాల వద్ద మధ్యాహ్నం నుంచి బందోబస్తులో ఉంటున్న పోలీసులు అర్ధరాత్రి దాటాక కూడా ఇళ్లకు వెళ్లలేక పోతున్నారు. ఇప్పటికే ముంబైకి అత్యంత సమస్యాత్మక నగరంగా పేరు ఉంది. ఉగ్రవాదులు ఎప్పుడు, ఏ రూపంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ఉగ్రవాదుల దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో నగరానికి రక్షణ ఇవ్వడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ముంబైలోని వాంఖడే, బ్రబార్న్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే అదనపు పని భారంతో సతమతమవుతున్న పోలీసులు బందోబస్తుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. వేసవి సెలవుల్లో అందరూ ఆనందంగా గడుపుతోంటే, తమకు కనీసం వారంతపు సెలవులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు క్రికెట్ మ్యాచ్ ఉంటే .. 12 గంటల నుంచే బందోబస్తుకు వెళ్లాలి. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ఉంటే మధ్యాహ్నం 3 గంటలకే రిపోర్టు చేయాలి. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 10 మంది పోలీసులు ఉండాల్సిన చోట 50 మందిని నియమిస్తున్నారు.

ఎర్రని ఎండలో బందోబస్తు ఉండే పోలీసుల వెతలు వర్ణనాతీతం. అర్ధరాత్రి మ్యాచ్ పూర్తయిన తరువాత కూడా ప్రేక్షకులందరూ వెళ్లిపోయేదాకా బందోబస్తు ఉండాలి. అనంతరం తమ కార్యాలయాలకు వెళ్లి వారి సీనియర్ అధికారులకు నివేదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలి. ఉదయం యథాతథంగా విధులకు హాజరు కావలి. దీంతో సమయానికి భోజనం, తగినంత నిద్ర, విశ్రాంతి లేక నరకయాతన పడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల సెలవులు మంజూరు కావడం లేదు. కొన్ని వారాలపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

మూడు నెలల్లో 26 మంది..
పనుల ఒత్తిడి వల్ల జనవరి 1 నుంచి మార్చి 31 వరకు (మూడు నెలల్లో) ముంబై పోలీసు శాఖకు చెందిన సుమారు 26 మంది కానిస్టేబుళ్లు వృుత్యువాత పడ్డారు. సమయానికి భోజనం, విశ్రాంతి లేకపోవడం, రక్తపోటు, గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి సమస్యలతో చనిపోయారు. 2014 లోనూ ఇదే పరిస్థితి. పోలీసు ఇన్‌స్పెక్టర్లు మొదలుకుని కానిస్టేబుల్ స్థాయి వరకు సుమారు 147 మంది దాకా చనిపోయారు. ఇందులో 41 పోలీసులు గుండెపోటుతో మృతి చెందినట్లు రికార్డులున్నాయి. రోజురోజుకు పోలీసుల్లో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిం చేందుకు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో వాటిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమలు చేయాలనుకుంటున్నవి జరిగితే పోలీసులపై ఒత్తిడి కొంత మేరకైనా తగ్గే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు