చీలిక అసాధ్యం!

9 Jan, 2017 10:52 IST|Sakshi
చీలిక అసాధ్యం!

► ఎవరి తరం కాదన్న చిన్నమ్మ
► దీపా కసరత్తులు   
► ఈరోడ్‌లో కొత్త పార్టీ


సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో చీలిక అసాధ్యమని, ఎవరెన్ని కుట్రలు చేసినా, వాటిని భగ్నం చేసి తీరుతానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి  శశికళ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారాల్ని నమ్మొద్దని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.

అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల గురించి తెలిసిందే. పార్టీ బలోపేతం, పట్టు సాధన లక్ష్యంగా ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ తీవ్రంగానే కసరత్తులు చేస్తూ వస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ కేడర్‌తో సమావేశం అవుతున్న ఆమె ఆదివారం కూడా  పార్టీ వర్గాలతో సమాలోచన సాగించారు.

తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల నేతలతో శశికళ సమావేశం అయ్యారు. ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు ఎడపాడి పళనిస్వామి, దిండుగల్‌ శ్రీనివాసన్, పార్టీ అధికార ప్రతినిధి పొన్నయ్యన్ తదితరులు ఆమెకు ఆహ్వానం పలికారు. కేడర్‌కు అభివాదం తెలుపుతూ రెండో అంతస్తులోని సమావేశ మందిరంలో గంటన్నర పాటు ఆయా జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు.

చీలిక అసాధ్యం:  జిల్లాల నేతల్ని ఉద్దేశించి శశికళ ప్రసంగిస్తూ, అన్నాడీఎంకే అతి పెద్ద పార్టీ అని పేర్కొన్నారు. దీనిని చీల్చడం ఎవరి తరం కాదన్నారు. అనేక కుట్రలు సాగుతున్నాయని, వాటిని భగ్నం చేసి తీరుతామన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా జిల్లాల్లో నేతలందరూ కేడర్‌కు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. మూడు నెలలకు ఓ మారు మండల, డివిజన్ వారిగా, ఆరు నెలలకు ఓ మారు జిల్లా స్థాయిలో పార్టీ సమావేశాలు జరిగే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచిం చారు.

పార్టీకి వ్యతిరేకంగా సాగే ప్రచారాలు, పుకార్లు నమ్మవద్దని, అందరి లక్ష్యం అమ్మ ఆశయ సాధనే అని ఆ దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సమావేశం ముగించుకుని పోయెస్‌ గార్డెన్ కు వెళ్తున్న శశికళను శ్రీపెరంబదూరుకు చెందిన రాజేష్, నందిని దంపతులు కలిశారు. తమ పాపకు పేరు పెట్టాలని కోరడంతో ఆ బిడ్డను చేతికి తీసుకుని జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అని ఇది వరకే ఓ పాపకు శశికళ నామకరణం చేసిన విషయం తెలిసిందే.

మరో కొత్త పార్టీ : అన్నాడీఎంకేలో ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తల తాకిడి దీపా ఇంటి వద్ద రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో రాజకీయ పయనానికి తగ్గ కసరత్తుల్ని దీపా వేగవంతం చేశారు. సంక్రాంతి తర్వాత ఏదైనా నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అభిమానులు పేర్కొంటున్నారు.

దీపాకు మద్దతుగా ఈరోడ్‌లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. జంట రోజాల చిహ్నంతో కూడిన ఆ పార్టీకి ఎంజీఆర్, జయలలిత అన్నాడీఎంకే అని పేరు పెట్టారు. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో అభిమానుల్ని ఏకం చేసే పనిలో పడ్డ దీపా పేరవై వర్గాలు తాజాగా వాట్సాప్‌ ద్వారా సభ్యత్వ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం గమనార్హం. అలాగే, దీపాకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేత నాంజిల్‌ సంపత్‌ స్పందించడాన్ని ఖండిస్తూ దీపా పేరవై వర్గాలు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు