చిన్నమ్మకు పెరోల్‌!

31 Jan, 2020 12:21 IST|Sakshi
శశికళ (ఫైల్‌)

మార్చిలో తిరువారూర్‌కు రాక

కసరత్తుల్లో కుటుంబీకులు  

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మరో నెల రోజుల్లో పెరోల్‌ మీద బయటకు రానున్నారు. ఇందకు తగ్గ కసరత్తుల్లో కుటుంబీకులు నిమగ్నమయ్యారు. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రం పరప్పన అగ్రహార చెరలో ఆమె ఉన్నారు. ఆమెకు విధించిన నాలుగు సంవత్సరాల శిక్షలో, ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు ముగిశాయి. ఇక ఏడాది పాటు ఆమె శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది భర్త నటరాజన్‌ అనారోగ్య పరిస్థితి, మరణం తదుపరి పరిణామాలతో రెండు సార్లు జైలు నుంచి పెరోల్‌ మీద చిన్నమ్మ బయటకు వచ్చారు. రెండో సారి అయితే పదిహేను రోజులు సమయం ఇచ్చినా, ఆమె తొమ్మిది రోజుల్లోనే మళ్లీ జైలుకు వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో మార్చిలో మళ్లీ ఆమె పెరోల్‌ మీద బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కుటుంబీకులు చేపట్టారు. గత వారం కుటుంబీకులు పరప్పన అగ్రహార చెరలో శశికళను కలిసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కుటుంబ కార్యక్రమం నిమిత్తం జైలు నుంచి బయటకు వచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించడంతో పెరోల్‌ ప్రయత్నాల మీద దృష్టి పెట్టారు. 

తమ్ముడి కుమారుడి వివాహం  
చిన్నమ్మ శశికళ సోదరుడు, అన్నా ద్రావిడర్‌ కళగం ప్రధాన కార్యదర్శి దివాకరన్‌ కుమారుడు జై ఆనంద్‌కు వివాహ ఏర్పాట్లు చేసి ఉన్నారు. మార్చి ఐదో తేదీన ఈ వివాహం తిరువారూర్‌ జిల్లా మన్నార్‌కుడిలో జరగనుంది. కుటుంబంలో జరిగిన ప్రతి వివాహ వేడుకకు చిన్నమ్మ హాజరై ఉన్న దృష్ట్యా, ఈ కార్యక్రమానికి సైతం రప్పించేందుకు నిర్ణయించారు. అందుకే ఆమె అనుమతితో పెరోల్‌ ప్రయత్నాల మీద దృష్టి పెట్టినట్టు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. 

స్టాలిన్‌ ఓ శక్తి  
తంజావూరులో గురువారం ఓ వివాహ వేడుకకు చిన్నమ్మ సోదరుడు దివాకరన్‌ హాజరయ్యారు. ఇదే వేడుకకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా వచ్చారు. ఈ సమయంలో దివాకరన్‌ వేదిక మీద ప్రసంగిస్తూ స్టాలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఏలేద్దామనుకుంటున్నాడని పరోక్షంగా రజనీకాంత్‌నుద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళుడే ఈ రాష్ట్రానికి పాలించాలని, తమిళుల సంక్షేమం, అభివృద్ధి, ప్రగతి కోసం ఆర్మీ దళపతి వలే డీఎంకేను నడిపిస్తున్న స్టాలిన్‌కు ఆ అర్హతలు ఉన్నాయన్నారు. అందుకే స్టాలిన్‌ వెంట నిలబడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా