తనిఖీ సొమ్ము స్వాహా

26 Mar, 2014 02:52 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారులే రూ8.25 లక్షలు స్వాహా చేసి కటకటాలపాలైన సంఘటన సేలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎన్నికల నిబంధనలు మేరకు రాష్ట్రంలో వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది. ఓటుకు నోటు విధానంపై ఆధారపడే నాయకులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక్క వాహనాన్నీ వదలకుండా రేయింబ వళ్లు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాధారణ ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదని, వ్యాపారులు రూ.10 లక్షల వరకు తీసుకెళ్లవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆ నగదుకు సరైన డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలని తెలిపింది.

 స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధిం చి డాక్యుమెంట్లు చూపిస్తే తిరిగి ఇచ్చేయూలని ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పదేపదే ప్రకటిస్తున్నారు. ఎన్ని చేసినా నగదు మాత్రం తరలుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు వాహనాల తనిఖీల్లో రూ.13 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐలు చేతివాటం ప్రదర్శించారు. స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత స్వాహా చేశారు. ఎన్నికల సందర్భంగా నియమితులైన ప్రత్యేక ఎస్‌ఐలు సుబ్రమణియన్, గోవిందన్ కుప్పనూర్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఏర్కాడుకు చెందిన ఎం.కుప్పుస్వామి (37) కొడెకైనాల్‌కు కారులో వెళుతుండగా సోమవారం రాత్రి చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్‌ఐలు ఆపారు. రెండు సంచుల్లో నగదును గుర్తిం చారు.

దీంతో కుప్పుస్వామి, కారులో ఉన్న రామసుందరం, డ్రైవర్ బాలకృష్ణన్‌ను వీరానం పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. అక్కడ రెండు సంచుల్లోని నగదును లెక్కించారు. నగదుకు సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు లేవని కుప్పుస్వామి చెప్పడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సహాయ అధికారి ముత్తురామలింగంకు అప్పగించారు. నగదును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి ఒక పత్రాన్ని సిద్ధం చేసి కుప్పుస్వామిని సంతకం చేయాల్సిందిగా కోరాడు. అందులో రూ.26.75 లక్షలు ఉన్నట్టు రాసి ఉండడాన్ని గమనించిన అతను సంతకం చేయడానికి నిరాకరించాడు. కొడెకైనాల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని చెల్లించేందుకు రూ.35 లక్షలు తీసుకెళుతున్నానని, మిగిలిన సొమ్ము ఏమైందని కుప్పుస్వామి ఆందోళన వ్యక్తం చేశాడు.

దీంతో బిత్తరపోయిన ముత్తురామలింగం పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన సేలం డీఐజీ అమర్‌రాజా, ఎస్పీ శక్తివేల్ పోలీసులే దొంగలని నిర్ధారించుకున్నారు. రూ.35 లక్షల నుంచి కాజేసిన రూ.8.25 లక్షలను వీరానం పోలీస్ స్టేషన్‌లోనే రహస్యంగా దాచినట్టు గుర్తించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత చెరిసగం పంచుకోవాలని ఇద్దరు ఎస్‌ఐలు పన్నిన పథకం బెడిసికొట్టింది. ఎస్‌ఐలు సుబ్రమణియన్, గోవిందన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. త్వరలో వారిద్దరినీ సస్పెండ్ చేయనున్నట్లు ఎస్పీ శక్తివేల్ ప్రకటించారు.

 తనిఖీలు వేధింపులు కాకూడదు
 వాహనాల తనిఖీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం ఎంతమాత్రం తగదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్‌కుమార్ మంగళవారం మరోసారి హెచ్చరించారు. తనిఖీల సమయంలో చిరు వ్యాపారుల నుంచి భారీ మొత్తంతోపాటు జేబుల్లో ఖర్చుకు పెట్టుకున్న నగదునంతా స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి అడ్డంకులు సృష్టించరాదని హితవు పలికారు. డాక్యుమెంట్లు సమర్పించేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వ్యవహరించరాదని వివరించారు. డాక్యుమెంట్లు చూపిన వారి సొమ్మును ఇచ్చేయడంలో ఎటువంటి జాప్యం కూడదన్నారు. నకిలీ అధికారులు చలామణిలో ఉన్నందున తనిఖీ విధులు నిర్వర్తించేవారు విధిగా తమ గుర్తింపు కార్డులను ధరించాలని ఆదేశించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా