కాంగ్రెస్‌లో నైరాశ్యం

3 Mar, 2014 00:38 IST|Sakshi
కాంగ్రెస్‌లో నైరాశ్యం

 సర్వే ఫలితాలన్నీ నిరాశాజనకంగానే ఉండడంతో ఎంపీ స్థానాల్లో నిలబడేందుకు కాంగ్రెస్ నాయకుల నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు. ఈ పరిస్థితిని గ్రహించిన కాంగ్రెస్ సరికొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్లను ఆక ర్షించడానికి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా, కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది.

 న్యూఢిల్లీ:

 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే నాలుగు నెలల కిందట ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద శక్తి. వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించి చరిత్ర సృష్టించిన పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటికి ఏడు స్థానాలు గెలుచుకున్న ఎదురులేని పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తరువాత నగరంలో దీని పరిస్థితి దిగజారింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై రాజకీయ పండితులు పెదవి విరుస్తున్నారు.

 

ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, నాలుగింటిలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపు లేవని, మిగతా మూడింటిలో గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని అంటున్నారు. కాంగ్రెస్ అంతర్గత సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నట్లు సమాచారం. పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ ఎంపీ స్థానాల్లో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ అంటేనే విసుగు ప్రదర్శిస్తున్నారని సర్వే ఫలితాల్లో తేలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ అడగడానికి కూడా వెనుకాడుతున్నారు.
 

 కొత్త వ్యూహంతో ఫలితం దక్కేనా ?
 

ఈ పరిస్థితిని గ్రహించిన కాంగ్రెస్ సరికొత్త వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్లను ఆక ర్షించడానికి సిట్టింగ్ ఎంపీలకు కాకుండా, కొత్తవారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. న్యూఢిల్లీ, చాందినీచౌక్‌ను మినహాయించి మిగతా లోక్‌సభ నియోజకవర్గాలన్నింటిలోనూ కొత్తవారికి టికెట్లు ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైన ముస్లింలు లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌వైపు మొగ్గు చూపే అవకాశముందని అంటున్నారు. ఈశాన్య లోక్‌సభ స్థానానికి డీపీసీసీ మాజీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇక్కడి నుంచి ప్రొఫెసర్ ఆనంద్ కుమార్‌ను బరిలోకి దింపుతోంది. పూర్వాంచల్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని బీజేపీ లాల్ బిహారీ తివారీకి టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రైమరీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

 

 పశ్చిమ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పశ్చిమ ఢిల్లీకి మహాబల్ మిశ్రా, దక్షిణ ఢిల్లీకి రమేష్‌కుమార్, న్యూఢిల్లీకి అజయ్ మాకెన్ ఎంపీలుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయాల దృష్ట్యా మహాబల్ మిశ్రా, రమేష్  కుమార్‌కు టికెట్లు లభించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైమరీ ద్వారా ఎన్నిక కావడంతో న్యూఢిల్లీ టికెట్ అజయ్ మాకెన్‌కు ఖాయమయింది. అలాగే చాందినీచౌక్ టికెట్ కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌కే మళ్లీ దక్కుతుందని అంటున్నారు. అయితే మరో కేంద్ర మంత్రి కృష్టాతీరథ్‌కు మళ్లీ టికెట్ లభించే అవకాశాలు పెద్దగా లేవని అంటున్నారు. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జైకిషన్‌ను ఇక్కడి నుంచి లోక్‌సభ బరిలోకి దింపవచ్చని సమాచారం.
 

మరిన్ని వార్తలు