చెన్నైలో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రి మాయ!

4 May, 2020 19:53 IST|Sakshi

వలస కార్మికుల ఆరోపణ  

సాక్షి, చెన్నై: నగర శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. మరణించిన మహిళకు ఠాకూర్‌ చిత్రం తరహాలో చికిత్స అందించి, చికిత్సకు తగ్గ ఫీజుల్ని కట్టించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఓ కాంగ్రెస్‌ ప్రముఖుడు రంగంలోకి దిగి పంచాయితీ పెట్టే పరిస్థితి నెలకొంది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళం పరిసరాలకు చెందిన వలస కూలీలు అనేక మంది పళ్లికరణై – పెరుంబాక్కం మార్గంలో ఉన్నారు. వీరంతా భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిర్మాణాలు జరిగే ప్రాంతాలే వీరికి ఆశ్రయంగా మారింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కష్టాల్ని ఎదుర్కొంటున్న ఈ కూలీల్లో ఓ కుటుంబం రెండు రోజుల నుంచి  తీవ్ర మనో వేదనలో మునిగింది. ఈ ప్రాంతానికి చెందిన వెంకటరావు భార్య సుజాత హఠాత్తుగా స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లడంతో ఆందోళన చెందిన వలస కూలీలు చేసేది లేక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్‌ వేళ వైద్య సేవలు కష్టమేనని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు చివరకు రూ. 40 వేలు చెల్లిస్తే అడ్మిట్‌ చేసుకుంటామని సలహా ఇచ్చినట్టు సమాచారం. 

లక్షా 24 వేలు బిల్లు.. 
కడుపు మాడ్చుకుని రేయింబవళ్లు కూలి నాలి చేసుకుని సంపాదించిన మొత్తంలో తమ వద్ద ఉన్న రూ. 35 వేలు చెల్లించి సుజాతను ఆస్పత్రిలో చేర్చారు. ఠాకూర్‌ సినిమా తరహాలో చికిత్స సుజాతకు సాగినట్టు సమాచారం. రూ.60 వేలుకు మందులు, మాత్రులు, స్కానింగ్‌లు, ఇతర వెద్యపరికరాల బిల్లు వెంకట్రావు చేతికి చేరింది. అయితే, తన వద్ద అంత మొత్తం లేదని ఆస్పత్రి వర్గాల వద్ద వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశాడు. ఉదయాన్నే గవర్నమెంట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తామని, అంత వరకు చికిత్స అందించాలని వేడుకున్నాడు. అంగీకరించిన ఆస్పత్రి వర్గాలు మరుసటి రోజు సుజాత మరణించినట్టు, రూ.లక్షా 24 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వెంకట్రావుకు సలహా ఇచ్చాయి.

అయితే తన భార్యకు రాత్రంతా ఏం చికిత్స చేశారంటూ వెంకట్రావు నిలదీశాడు. ఠాకూర్‌ సినిమా ఘటనను గుర్తు చేసుకుని ఆస్పత్రి వర్గాలపై వలస కూలీలు విరుచుకు పడ్డాయి. ఇక, చేసేది లేఖ ఆంధ్రాలో ఉన్న బంధువుల ద్వారా ఓ కాంగ్రెస్‌ నాయకుడిని వెంకట్రావు సంప్రదించినట్టున్నారు. ఆయన ఇక్కడున్న కాంగ్రెస్‌ నాయకుడికి చెప్పడంతో శనివారం వ్యవహారం మీడియా దృష్టి  చేరింది. దీంతో మీడియాలో రచ్చ మొదలు కావడం,  కాంగ్రెస్‌ నాయకుడు పంచాయితీ వెరసి రూ.50 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు సలహా ఇవ్వడం గమనార్హం. 

చివరకు 30 వేలు ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ వలస కూలీలకు ఏర్పడింది. అయితే, మీడియాలో వ్యవహారం రచ్చకెక్కడంతో ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. ఆమెను 11.30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, 12.30 గంటలకు తొలిసారిగా గుండె పోటు  వచ్చినట్టు, మళ్లీ..మళ్లీ గుండె పోటు రావడంతో 3.30 గంటలకు మరణించినట్టు వివరించారు. ఆస్పత్రి బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు తమపై నిందలు వేస్తున్నారని ఆ బులిటెన్‌లో ఆస్పత్రి వర్గాలు వివరించి చేతులు దులుపుకున్నాయి. 

మరిన్ని వార్తలు