-

శింబుపై కుట్ర జరుగుతోంది

10 Jul, 2015 02:49 IST|Sakshi
శింబుపై కుట్ర జరుగుతోంది

 తన కొడుకు, నటుడు శింబుపై కుట్ర జరుగుతోంది. తన చిత్రాలు విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారంటూ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత టి.రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శింబు నటించిన వాలు చిత్రాన్ని నిక్ ఆర్ట్స్ పతాకంపై చక్రవర్తి నిర్మించారు. హన్సిక హీరోయిన్. సమస్యలపై సమస్యల కారణంగా చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని శింబు తండ్రి టి.రాజేంద్రన్‌నే విడుదల చేయడానికి పూనుకున్నారు. చిత్రాన్ని ఈ నెల 17న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 ఇలాంటి పరిస్థితిలో మ్యాజిక్ రేస్ సంస్థ వాలు చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి హక్కులు తమకు ఉన్నట్లు 10 కోట్లకు 2013లోనే ఒప్పందం కుదుర్చుకున్నటు పేర్కొంటూ రెండు రోజుల క్రితం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు 13వ తేదీన వాయిదా వేస్తూ నిర్మాతల తరపున బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాటు చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించిందంటూ మీడియా ప్రచారం చేసింది.
 
 ఈ ప్రచారాన్ని టి.రాజేంద్రన్ తీవ్రంగా ఖండించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాలు చిత్ర విడుదల పై కోర్టు తాత్కాలిక నిషేధం విధించిందని ఒకవర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం స్టేటస్‌కో అని పేర్కొందని దాన్ని స్టేగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.కోర్టు తీర్పుకు తలవంచుతా : వాలు చిత్ర వ్యవహారాన్ని న్యాయస్థానం ఈ నెల 13న విచారించనుందన్నారు. కోర్టు తీర్పును శిరసావహిస్తానని టీఆర్ అన్నారు. తనకు భగవంతునిపై నమ్మకం ఉంది. ఆయన మంచి చేస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.
 
 శింబుపై కుట్ర జరుగుతోంది: శింబుపై కుట్ర జరుగుతోందని, తన చిత్రాలు విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాలు చిత్ర నిర్మాత చక్రవర్తి కష్టాల్లో ఉన్నారు. ఆయన్ని ఆదుకోవాలనే ఈ చిత్రాన్ని తాను విడుదల చేయాలని భావించానని అన్నారు. వాలు చిత్రాన్ని తాను విడుదల చేయనున్నట్లు జూన్ నెల 19వ తేదిన ప్రకటించానన్నారు. అప్పటినుంచి ప్రచారం చేస్తున్నానని అలాంటిది ఈ మధ్య కాలంలో మౌనంగా ఉన్న మ్యాజిక్ రేస్ సంస్థ సడన్‌గా ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.
 
  వాలు చిత్ర హక్కులను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? లేక చిత్ర విడుదలను నిలిపి వేయాలనుకుంటున్నారా? ఇదంతా చూస్తుంటే శింబుపై కుట్ర జరుగుతోందని అనుమానం కలుగుతుందన్నారు. వాలు చిత్ర విడుదల కోసం తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్ల తదితర సంప్రదింపులు జరిపి వారి సహకారం కోరి చిత్రాన్ని విడుదల చేయడానికి తీవ్ర కృషి చేస్తుంటే తనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో రాజకీయం జరుగుతోందని ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు