సండే స్పెషల్‌ గురూ!

11 Dec, 2016 03:32 IST|Sakshi

కుక్కలను కోసి కొండ గొర్రె మాంసమని విక్రయం
- లేగ దూడలను కోసి దుప్పి మాంసం అని అమ్మకం
- పిల్లులను చంపి కుందేలు మాంసం అంటున్నారని ప్రచారం
- కిలో మటన్‌ ధరలో.. సగానికే అమ్మడంపై అనుమానాలు
- ఇప్పటికే వరంగల్‌లో పోలీసులకు పట్టుబడిన ఓ ముఠా


పెద్దపల్లి: వన్య ప్రాణుల మాంసం అంటే ఎవరికైనా ఇష్టమే.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాటుమాటున వన్యప్రాణుల మాంసం విక్రయిస్తూ అక్కడక్కడా పోలీసులకు పట్టుబడుతున్న వారున్నారు. వన్య ప్రాణుల మాంసం పేరిట స్థానికంగా గ్రామాల్లో సంచరించే కొందరు వ్యక్తులు కుక్కలు, లేగదూడలు, పిల్లుల మాంసాన్ని వన్య ప్రాణుల మాంసంగా సండే స్పెషల్‌ పేరిట అమ్ముతున్నారు. పెద్దపల్లి పట్టణానికి ప్రతి ఆదివారం కొందరు వ్యక్తులు నిర్మల్, మహాముత్తారం ప్రాంతం నుంచి మాంసం తెచ్చి విక్రయిస్తున్నారు. అయితే వారు ప్రతి ఆదివారమే అమ్మడం అనుమానాలకు తావిస్తోంది.

వన్య ప్రాణులన్నీ శనివారమే దొరుకుతున్నాయా.. అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. కాగా, వన్య ప్రాణుల పేరిట కుక్కలను చంపి కొండ గొర్రెగా, లేగ దూడలను కోసి దుప్పి మాంసంగా, జంగపిల్లులు, పెంపుడు పిల్లులను హతమార్చి కుందేలు మాంసంగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదారు నెలల క్రితం జయశంకర్‌ జిల్లాకు చెందిన కొందరు వేటగాళ్లు లేగలను చంపి దుప్పి మాంసంగా వరంగల్‌లో ప్రతి ఆదివారం విక్రయిస్తుండగా.. ఈ ముఠాను పథకం ప్రకారం అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దాంతో వేటగాళ్లు తెస్తున్న మాంసం వన్యప్రాణులది కాదని, స్థానికంగా ఉన్న జంతువుల మాంసాన్ని ఈ రకంగా విక్రయిస్తున్నట్లు తేటతెల్లమైంది.

ఆదివారమే ఎందుకు..?
మాంసం ప్రియులు ప్రతి ఆదివారం విందు చేసుకోవడం సహజం. జిహ్వచాపల్యం వన్యప్రాణుల రుచిని కోరడంతో ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ఆదివారం ఇలాంటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. గడిచిన ఐదారేళ్లుగా వన్య ప్రాణుల మాంసం ప్రతి వారంవారం పెద్దపల్లిలో విక్రయిస్తున్నారు. ఇక ధర విషయంలో కూడా గొర్రె, మేక మాంసం కంటే ధర తక్కువకు లభించడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది. ఎంతో అరుదుగా లభించే కొండ గొర్రె కిలో మాంసం ధర కేవలం రూ. 250లకే అందిస్తున్నారు. ఇక దుప్పి, మెకం లాంటి జంతువుల మాంసాన్ని కిలో రూ. 300లకే విక్రయిస్తున్నారు. స్థానిక మార్కెట్లలో గొర్రె పొట్టేలు, మేక మాంసం ధర కిలో రూ. 450 పైనే ఉంటోంది. రహస్యంగా అమ్ముతున్న వన్యప్రాణుల మాంసం ధర రెట్టింపు ఉండాల్సిందిపోయి.. సగం ధరకే దూర ప్రాంతాల నుంచి తెచ్చి మరీ ఇక్కడ విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల నుంచి వాట్సాప్‌లో కుక్కను కోసి వన్య ప్రాణుల మాంసంగా విక్రయిస్తున్నారన్న వీడియో ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. దీంతో కొద్దికాలంగా ఆదివారం పూట వన్యప్రాణుల మాంసంగా ఎంతో రుచితో తింటున్న వారు కూడా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు.

అప్పట్లో నాగా దళాలు..
పెద్దపల్లి జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో ఇక్కడికి చేరుకున్న నాగాలాండ్‌ దళాల సభ్యులు కుక్కలను విచ్చలవిడిగా చంపితిన్నారు. పెద్దపల్లి, ధర్మారం, వెల్గటూర్‌ మండల కేంద్రాల్లో ఎన్నికలకోసం నాగాలాండ్‌ దళాలను కేంద్ర ప్రభుత్వం దించింది. ఆ సమయంలో పహారా కాస్తున్న నాగా దళాల సభ్యులు తమకు ఎదురుపడ్డ ఊర కుక్కలను చంపి, వేపుకొని మరీ తిన్నారు. ఇలా చాలాకుక్కలు నాగా దళాలకు ఆహారంగా మారాయి. అదే పద్ధతిలో అటవీప్రాంతాలకు చెందిన వేటగాళ్లు కుక్కలను చంపి వన్యప్రాణి మాంసంగా విక్రయిస్తున్నారని పలువురు మాంసప్రియులు అంటున్నారు.

కొండ గొర్రె కూర ఉందని ఫోనొచ్చింది..
పోయిన ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం నుంచి ఓ వ్యక్తి కొండగొర్రె కూర ఉందని ఫోన్‌ చేశాడు. ఆ రోజు మా ఇంట్లో విందు ఉండడంతో అప్పటికే మాంసం తెచ్చుకున్నాం. ఈ కూర తీసుకోలేదు. పోలీసులకు దొరికితే కేసు పెడతారని భయంతో వద్దన్నాం. కానీ, పెంపుడు జంతువులనే చంపి, అడవి మాంసంగా అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  
  – కొండి శ్రీనివాస్, మెకానిక్‌

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా