భర్తపై చర్యలు తీసుకోండి

26 May, 2015 03:40 IST|Sakshi

 తిరువళ్లూరు : మగసంతానం లేదన్న కారణంతో రెండో పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళ ఆందోళన చేసింది. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ రామమూర్తి(33). ఇతను అదే ప్రాంతానికి చెందిన పునితా(28)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి విశాలి(07), మనీషా(05), శిరీషా(03) ముగ్గురు ఆడపిల్లలు. పునితాకు ముగ్గురూ ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం లేదని తరచూ భార్యను వేధించేవాడు.
 
 తనకు మగ సంతానం కలగనందున పుట్టింటి నుంచి మూడు లక్షల రూపాయలను కట్నంగా తేవాలని బలవంతపెట్టేవాడు. అంతేగాక గత జనవరి 23న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామానికి సమీపంలో ఉన్న అత్తకూతూరు వేదవతిని రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పునితా తన బంధువులతో కలిసి గత జనవరి 30న ఎస్పీ శ్యామ్‌సన్‌ను ఆశ్రయించింది. అయితే ఎస్పీకి ఇంతవరకు స్పందించలేదు. ఆగ్రహించిన పునితా తన ముగ్గరు పిల్లలతో వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయడంతో పాటు భర్తను అప్పగించాలని రోదించింది.
 

>
మరిన్ని వార్తలు