ఠారెత్తిస్తున్నారు! | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్నారు!

Published Tue, May 26 2015 3:39 AM

On capital drug gang

- రాజధానిపై కన్నేసిన మాదకద్రవ్యాల ముఠాలు
- అప్రమత్తమైన ‘ఇంటెలిజెన్స్’
- ఆరాతీస్తున్న పోలీసులు
విజయవాడ సిటీ :
రాజధానిపై మాదకద్రవ్యాల ముఠాలు కన్నేశాయా.. ఇక్కడుండే కొందరి సాయంతో ఈ ముఠాలు పాగా వేయనున్నాయా.. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం మాదకద్రవ్యాల ముఠాల గురించి సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు సిమీ ఉగ్రవాదుల కదలికలు.. నకిలీ నోట్ల చెలామణి ముఠాలు.. రియల్ మాఫియాకు కేంద్రంగా మారిన రాజధాని మాదకద్రవ్యాల ముఠాలకు కేంద్ర స్థావరం కానుందనే సమాచారం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.   

సేకరించిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ పోలీసులు మాదకద్రవ్యాల ముఠాను పట్టుకున్నారు. వారి విచారణలో విదేశాల నుంచి సముద్ర మార్గంలో మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తరలించినట్టు నిందితులు అంగీకరించారు. విదేశాల నుంచి మచిలీపట్నం పోర్టుకు చేరుకున్న తర్వాత విజయవాడకు చెందిన ఒకరిద్దరు వ్యక్తుల సాయంతో హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు నిందితులు సమాచారమిచ్చారు. దీనిపై ఇక్కడి పోలీసులకు నిఘావర్గాలు సమాచారం ఇచ్చాయి. దాన్ని నిర్థారించుకునే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. నిజంగానే ఇక్కడి వ్యక్తులు సహకరించారా.. లేక విచారణను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు తప్పుడు సమాచారం ఇచ్చారా.. అనే దిశగా పోలీసులు దృష్టిసారించినట్టు తెలిసింది. గతంలో మాదకద్రవ్యాల ముఠాల మూలాలు ఇక్కడ ఉండడం కూడా పోలీసులను ఆలోచనలో పడేసింది.

ప్రకాశం బ్యారేజీ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద హెరాయిన్ తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. దీంతో సరుకును వదిలేసి ముఠా సభ్యులు పరారయ్యారు. కొందరు స్థానికుల సాయంతోనే వీరు తప్పించుకున్నట్టు అప్పట్లో పోలీసులకు సమాచారం వచ్చింది. తిరిగి ఇలాంటి ఘటనలు లేనప్పటికీ.. శివారు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందనే అనుమానంపై తరుచూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిఘావర్గాల సమాచారంపై పోలీసులు అప్రమత్తమైనట్టు తెలిసింది.

ముందునుంచే అనుమానాలు
కొత్త రాజధాని ఏర్పాటు సమయంలో నకిలీ నోట్ల  ముఠాలు, మాదకద్రవ్యాల ముఠాలు ముందస్తు స్థావరాలు ఏర్పాటుచేసుకుంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తూ వచ్చారు. ఆదినుంచే ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాజధాని పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేయడం పరిపాటని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ తరహా ముఠాలు రావచ్చని అనుమానించిన పోలీసువర్గాలు నిఘాను పటిష్టం చేశాయి. ఇప్పటికే నకిలీ నోట్ల ముఠాలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సమాచారం తమ అనుమానాలను బలపరిచిందని, దీనిపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయనున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement