ఐక్యతతో ముందుకు..

22 Jul, 2017 01:57 IST|Sakshi
ఐక్యతతో ముందుకు..

అధ్యక్షులతో సమాలోచన
ఈవీకేఎస్‌ వర్గం డుమ్మా
కాంగ్రెస్‌ బలోపేతం లక్ష్యంగాకార్యాచరణ

సాక్షి, చెన్నై: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచనల మేరకు ఇక్కడి నేతలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ పిలుపు నిచ్చారు. కొత్త అధ్యక్షులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ వర్గం డుమ్మా కొట్టడంతో ఇదేనా ఐక్యత అని పెదవి విప్పిన వాళ్లూ ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో పార్టీ పరంగా 72 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్యను ఇటీవలే పెంచారు.

ఈ జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని గత వారం నియమించారు. ఇందులో మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు 22 మంది ఆ వర్గానికి చెందిన వారు వివిధ జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నారు. వీరందర్నీ తొలగించారు. కొత్త జాబితాలో కేవలం 13 మందికి మాత్రమే ఈవీకేఎస్‌ వర్గానికి చోటు దక్కింది. దీంతో ఆ శిబిరం తమ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలు సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలతో కొత్త అధ్యక్షులతో సమాలోచన సమావేశానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఐక్యతతో ముందుకు:
సత్యమూర్తి భవన్‌లో ఉదయం జరిగిన సమావేశానికి గ్రూపుల నేతలు తంగబాలు, కుమరి ఆనందన్, వసంతకుమార్, కష్ణ స్వామితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హాజరయ్యారు. పదమూడు జిల్లాలు మినహా తక్కిన జిల్లాలకు చెందిన అధ్యక్షులు అందరూ ఈ సమావేశానికి హాజరై పరిచయాలు చేసుకున్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాల విస్తృతం, సభ్యత్వ నమోదుపై చర్చించారు. 


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు జిల్లాల అధ్యక్షులకు పంపించడం జరుగుతుందని, ఆ మేరకు కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. అలాగే, గ్రూపులు అన్నది పక్కన పెట్టి, ఐక్యతతో ముందుకు సాగాలని, అప్పుడే బలాన్ని నిరూపించుకోగలమని పేర్కొనడం గమనార్హం. రాహుల్‌ ఆదేశాల మేరకు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని, సాగుదామని పిలుపునిచ్చారు.

ఈ సమయంలో అక్కడున్న నేతలు పలువురు ఇప్పటికే 13 జిల్లాలకు చెందిన అధ్యక్షులు తిరుగుబాటు ధోరణితో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక, ఐక్యత ఎక్కడ అని చెవులు కొరుక్కోవడం గమనార్హం. ఈ సమావేశానంతరం మీడియాతో తిరునావుక్కరసర్‌ మాట్లాడుతూ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగనున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థికి డీఎంకే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని, అన్నాడీఎంకేలోని బలహీన పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు