అడియాశలు

29 Apr, 2016 04:22 IST|Sakshi
అడియాశలు

అన్ని జలాశయాలు ఖాళీ ఖాళీ...... అడుగంటుతున్న నీటిమట్టం
జూన్ మొదటి వారానికి డెడ్‌స్టోరేజ్‌కు
రెండో పంటకు నీళ్లివ్వక పోవడం వల్లే ఈ మాత్రమైనా నీరుంది
మంత్రి ఎం.బి.పాటిల్

 
 
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని జలాశయాలన్నీ అడుగంటిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలకు జీవజలాన్ని అందిస్తూ వచ్చిన ప్రముఖ జలాశయాల్లో సైతం నీటిమట్టం డెడ్‌స్టోరేజ్‌కు సమీపంలో ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్తంత పొదుపుగా వాడుకుంటే ఈ నీళ్లు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చగలవని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ తరువాత మాత్రం డెడ్‌స్టోరేజ్‌లోని నీటిని సైతం తోడేసి శుద్ధి చేసి అందజేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. అయితే జూన్ వరకు కూడా వర్షాలు లేకపోతే అప్పుడేం చేయాలన్న భయం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ప్రజలను కూడా వేధిస్తోంది.

బెంగళూరుకు తాగునీటిని అందజేసే కేఆర్‌ఎస్ డ్యామ్‌లో నీటిమట్టం ఇప్పటికే డెడ్‌స్టోరేజ్ సమీపానికి చేరుకోవడంతో బెంగళూరు నగరంలో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేసే పరిస్థితి తలెత్తింది. రానున్న రోజుల్లో వారానికి ఒకేసారి నీటిని సరఫరా చేయాలని, తద్వారా కాస్తంత నీటిని పొదుపు చేయాలని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు బెంగళూరు జలమండలి అధికారులను ఆదేశించారు. దీంతో బెంగళూరులోని ప్రజలు ప్రస్తుతం నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేలా లేదు. గురువారం నాటికి కేఆర్‌ఎస్ జలాశయంలో 10.92టీఎంసీల నీటిమట్టం నమోదైంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల పరిస్థితి కూడా ఇదే విధంగా
 
 ఉంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైన కబినిలో శుక్రవారం నాటికి 4.41టీఎంసీలు, ఆలమట్టిలో 13.61టీఎంసీలు, నారాయణ్‌పూర్‌లో 13.34టీఎంసీలు, హారంగిలో 1టీఎంసీల నీటిమట్టం నమోదైంది.
 నీటిని పొదుపుగా వాడుకోవాలి......
 రాష్ట్రంలో పరిస్థితిని ముందుగానే ఊహించి నవంబర్‌లో రెండో పంటకు నీరివ్వబోమని ప్రకటించాము. రైతు సంఘాల నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకే ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపోతుంది. అప్పటికీ వర్షాలు కురవకపోతే ఇక డెడ్‌స్టోరేజ్‌లో ఉన్న నీటిని సైతం శుద్ధి చేసి ప్రజలకు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు నీటిని చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. లేదంటే కర్ణాటకలో సైతం రైళ్ల ద్వారా నీటిని అందజేయాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.
     - ఎం.బి.పాటిల్, రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు