నిర్మాతలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన

2 Dec, 2013 06:16 IST|Sakshi

 = నిర్మాతలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచన
 = బిఫ్‌కు రూ. 2 కోట్లు విడుదల
 = ‘కృష్ణా’లో బిఫ్ లోగో విడుదల చేసిన సీఎం
 = 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు కార్యక్రమాలు

 
సాక్షి, బెంగళూరు : ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటు రాష్ట్ర సంసృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సామాజిక సృహ ఉన్న చిత్రాలను నిర్మించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిత్ర నిర్మాతలు, దర్శకులకు సూచించారు. క్యాంపు కార్యాలయం ‘కృష్ణా’లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 6వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల (బెంగళూరు ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-బిఫ్) లోగోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ... ‘బంగారద మనుష్య’, ‘సంగోళ్లిరాయణ్ణ’ వంటి  సామాజిక చిత్రాలు గతంలో చాలా వచ్చేవన్నారు.

ఈ సినిమాలను చూసి చాలామంది తమ ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను మార్చుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి చిత్రాల నిర్మాణం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అభిరుచి ఉన్న నిర్మాతలు, దర్శకులు సామాజిక చిత్రాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది బిఫ్‌కు తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. అవసరమనుకుంటే మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిద్ధరామయ్య తెలిపారు.

 ధూమ్-3 వల్లే ఆలస్యం: నరహరిరావ్

 ఈ ఏడాది బిఫ్స్‌ను ఈనెల 19న ప్రారంభించి వారం పాటు జరపాలని నిర్ణయించినా ధూమ్-3 సినిమా వల్ల చలనచిత్రోత్సవ ప్రారంభం ఆలస్యమైందని బిఫ్స్ ఆర్టిస్టిక్ డెరైక్టర్ నరహరిరావ్ తెలిపారు. ధూమ్-3 సినిమా ఈనెల 20న విడుదలవుతున్నందువల్ల స్క్రీన్‌లు ఇవ్వలేమని థియేటర్ల యాజమాన్యాలు  చెప్పడం వల్లే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను వాయిదా వేయాల్సి వ చ్చిందన్నారు. గోవా తదితర అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఆయా రాష్ట్రాల సొంత స్క్రీన్‌లు ఉంటాయన్నారు. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత ఏడాది బిఫ్ కంటే ఈసారి ప్రదర్శిస్తున్న చిత్రాల సంఖ్య తక్కువగా ఉన్నమాట వాస్తవమన్నారు.  నిధుల కొరతే ఇందుకు ప్రధానకారమణమన్నారు. నాణ్యమైన చిత్రాలను ఎంపిక చేయాలనే ఉద్దేశం కూడా మరో కారణమని నరహరిరావ్ తెలిపారు.  
 
 ఇవి బిఫ్ వివరాలు
 = 6వ బిఫ్ చలనచిత్రోత్సవాలు ఈనెల 26న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 2 వరకూ జరగనున్నాయి.
 
 = బహుభాషానటుడు కమల్‌హాసన్‌తో
 
 =పాటు దేశవిదేశాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
 
 = ఇండియాతో పాటు 45 దేశాలకు చెందిన 152 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏడు స్క్రీన్‌లను ఎంపిక చేశారు.
 
 = ఏషియన్ సినిమా, ఇండియన్ సినిమా, కన్నడ సినిమా విభాగాలకు ఎంపికయిన చిత్రాల్లో ఉత్తమమైన వాటిని జ్యూరీ సభ్యులు గుర్తించి నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
 
 = ఇండియాన్ సినిమా విభాగంలో తెలుగు చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. చిత్రాల వివరాలను నిర్వాహకులు త్వరలో బహిరంగపరుచనున్నారు.
 
 =  86వ అకాడమి అవార్డ్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ (ఆస్కార్) విభాగానికి ఎంట్రీ పొందిన14 చిత్రాలను ఈ చలనచిత్రోత్సావాల్లో ప్రదర్శించనున్నారు.
 
 = చిత్రాలను చూడటానికి సాధారణ ప్రజలకు రూ.500, విద్యార్థులకు, చిత్రరంగ నిర్మాణంలో ఉన్న వారికి రూ.250ల ఫీజుగా నిర్ణయించారు. ఒక్క పాసును తీసుకుని ఎన్ని సినిమాలైనా చూడవచ్చు.
 
 పాసులు దొరికే స్థలం
 ( నేటి నుంచి పాసులు పొందవచ్చు)
 1) కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, క్రిసెంట్ రోడ్డు
 2) సమాచార శాఖ, ఇన్ఫాంట్రీ రోడ్డు
 3) బిఫ్స్ కార్యాలయం, బాదామి హౌస్
 4) సుచిత్రా ఫిల్మ్ సొసైటీ, బీఎస్‌కే 2వ స్టేజ్
 5) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం www.biffes.in
 చిత్రాలను ప్రదర్శించే సినిమా హాళ్ల వివరాలు
 1) 3 స్క్రీన్‌లు, ఫన్ సినిమా-సిగ్మామాల్, కన్నింగ్‌హామ్ రోడ్డు
 2) 2 స్క్రీన్‌లు, ఐనాక్స్-లిడోమాల్, హలసూర్
 3) 1 స్క్రీన్, సమాచారశాఖ, ఇన్ఫాంట్రీ రోడ్డు
 4) 1 స్క్రీన్, ప్రియదర్శిని (బాదామిహౌస్), ఎన్.ఆర్ స్వ్కైర్     
 

మరిన్ని వార్తలు