ప్రాణాలు తీసిన బైక్ రేస్

4 Jun, 2015 03:18 IST|Sakshi
ప్రాణాలు తీసిన బైక్ రేస్

 చెన్నై, సాక్షి ప్రతినిధి: ముగ్గురు యువకుల బైక్‌రేస్ వ్యామోహం మరో ముగ్గురి జీవితాలను చిదిమేసింది. నిండు వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు బైక్ చక్రాల కింద నలిగిపోయారు. మరో వ్యక్తికి అతను పడుకున్న మంచాన్నే యమపాశంగా మార్చేశారు. చె న్నైలో బైక్‌రేసులకు అడ్డూ అదుపులేదనేందుకు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరకలే తార్కాణం.
 
 చెన్నై ప్యారిస్‌లోని పాత తిరువళ్లూర్ బస్‌స్టేషన్ పరిసరాల్లో పగటివేళ వ్యాపారాలు చేసుకుని, రాత్రి వేళ ఫుట్‌పాత్‌లే పట్టెమంచంగా భావించి నిద్రబోయే అభాగ్యులు ఎందరో ఉన్నారు. రోడ్లపై తోపుడుబళ్లు, పూల బడ్డీలు పెట్టుకుని వ్యాపారం ముగించుకున్న తరువాత రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపై పడుకోవడం అలవాటు. ఎప్పటిలానే ఫ్లాట్‌ఫారాలపై కొందరు పడుకోగా, మంగళవారం రాత్రి వర్షం పడడంతో బర్మాబజార్ ఫ్లాట్‌ఫారంపై మరికొందరు నిద్రించారు.
 
 తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై అతివేగంగా ముత్తుస్వామి ఫ్లైవోవర్ బ్రిడ్జి మీదుగా హార్బర్ వద్దకు వస్తుండగా ప్యారిస్ కూడలి వద్ద పోలీసు తనిఖీలను గమనించారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో అదేవేగంతో బైక్‌ను పక్కసందులోకి దారిమళ్లించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పగా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లింది. బైక్ ఢీకొట్టిన వేగానికి ఇనుపమంచం వేసుకుని నిద్రిస్తున్న అప్పు గాల్లోకి ఎగిరాడు. మంచం ముక్కలుచెక్కలై నిలబడగా అప్పు అదే మంచంపై పడడంతో అందులోని ఇనుక కమ్మీ కడుపులోకి గుచ్చుకోగా విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అప్పు హిజ్రా అని తెలుస్తోంది.
 
 అయినా వేగం తగ్గించని యువకులు ఫ్టాట్‌ఫారంపైనే నిద్రిస్తున్న చిన్నపొన్ను, రుక్మిణి, మణిలపైకి ఎక్కింది. మంచి నిద్రలో ఉన్నవారు బిగ్గరగా కేకలు పెట్టారు. అప్పటికీ వెనక్కుతగ్గని యువకులు బైక్‌ను అదేవేగంతో మరింత ముందుకు పోనివ్వగా శకుంతల (70) అనే మహిళ తలఛిద్రమై ప్రాణాలు విడిచింది. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోగా పక్క ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం మేల్కొని బైక్‌లతో వీరంగం సృష్టించిన ముగ్గురు యువకుల వెంటపడ్డారు.
 
  వీరికి దొరక్కుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు యువకుల రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఆ పరిసరాల్లో ఫ్లాట్‌ఫారాలపై నిద్రిస్తున్న జనం ముగ్గురు యువకులను ఒడిసి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనేక బైక్‌లలో వస్తున్న మరికొందరు యువకులు ఈ దారుణాన్ని దూరం నుంచి గమనించి వెనక్కు పారిపోయారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫ్లవర్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో
  శకుంతల (70), చిన్నపొన్ను (60) అనే ఇద్దరు మహిళలు, అప్పు అనే హిజ్రా (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు ఐస్‌హౌస్‌కు చెందిన సాదిక్ (18), ట్రిప్లికేన్‌కు చెందిన మన్సూర్ (19), రసూద్ (18)లుగా గుర్తించారు. సెల్‌ఫోన్ షాపులో పనిచేసే ఈ ముగ్గురు మంగళవారం రాత్రి రాయపేట దర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఈ వికృత క్రీడకు పాల్పడినట్లు సమాచారం. బైక్‌రేసుల వ్యామోహంతో ముగ్గురు ప్రాణాలను తీయడమేగాక వారు వారు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ముగ్గురిలో సాధిక్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, తీవ్రగాయాలకు గుైరె న కారణంతో స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించారు.
 
 బైక్ రేసులు షరామామూలే:
 చెన్నైలో రాత్రివేళ గుట్టుగా సాగుతున్న బైక్‌రేసు లపై ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అదుపుచేసే నాథుడే కరువయ్యాడు.  మౌంట్‌రోడ్డు, ఉత్తరకోట ప్రాంతాల్లో ఎక్కువగా బైక్‌రేసులు జరుగుతున్నట్లు సమాచారం. ఆరు నెలల క్రితం రాజాఅన్నామలై మన్రం వద్ద పూలవ్యాపారం చేసుకుంటున్న మహిళ ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తుండగా వాహనం కింద నలిగి చనిపోయింది. మరో  సంఘటనలో మన్నాడీ తండిశెట్టి వీధిలో ఒక చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. చెన్నైలో బైక్‌రేసుల చరిత్రలో మరోపేజీ బుధవారం రక్తసిక్తమైంది.
 

మరిన్ని వార్తలు