తీహర్ జైలుకు క్రేజీవాల్

22 May, 2014 01:06 IST|Sakshi
తీహర్ జైలుకు క్రేజీవాల్

గడ్కరీ పరువు నష్టం కేసులో  బెయిల్ బాండు సమర్పణకు ససేమిరా
- రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు
 
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు రెండు రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో మంగళవారం కోర్టుకు హాజరైన ఆయన.. బెయిల్ కోసం రూ.10వేల పూచీకత్తు సమర్పించడానికి నిరాకరించారు. దీంతో కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుని తిరిగి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోకా ఆదేశాలు జారీచేశారు. వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య తీహార్ జైలుకు తరలించారు.

భారత్‌లో అత్యంత అవినీతిపరులైన వ్యక్తుల వీరేనంటూ ఈ ఏడాది జనవరి 31న కేజ్రీవాల్ ఓ జాబితా విడుదల చేశారు. అందులో బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ పేరును కూడా పేర్కొన్నారు. దీంతో తన పరువుకు కేజ్రీవాల్ భంగం కలిగించారని ఆరోపిస్తూ గడ్కరీ పరువునష్టం కేసు వేశారు. అనంతరం ఈ కేసు విచారణకుగాను బుధవారం కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. దీంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ కోసం రూ.10వేల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి ఓ ష్యూరిటీ సమర్పించాలని న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సూచించింది. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు.

కావాలంటే ప్రతి విచారణకు కోర్టుకు హాజరవుతానని పేర్కొంటూ హామీపత్రం (అండర్‌టేకింగ్) ఇస్తానని, బెయిల్ కోసం బాండు మ్రాతం ఇవ్వనని పేర్కొన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఆయన(కేజ్రీవాల్) ఎందుకు బెయిల్ బాండ్ ఇవ్వనంటున్నారు? అసలు మీ సమస్య ఏమిటి? దీనికో ప్రక్రియ ఉంది కదా? అలాంటప్పుడు ఆయన ఎందుకు ఈ కేసులో మరోలా వ్యవహరిస్తానని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా ప్రత్యేకంగా గుర్తించాలని అనుకుంటున్నారా’’ అని ప్రశ్నించారు.

దీనికి కేజ్రీ స్పందిస్తూ.. తాను ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపూ కోరుకోవడంలేదన్నారు. ‘‘ఇది నా సిద్ధాంతం. నేను ఎలాంటి తప్పూ చేయనప్పుడు నేను బెయిల్ తీసుకోవాలని అనుకోవడంలేదు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఇలాంటి కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని, ఆప్ సిద్ధాంతాల ప్రకారం వారు బెయిల్ బాండ్ సమర్పించరని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రాహుల్ మెహ్రాలు న్యాయస్థానానికి నివేదించారు. సాక్ష్యాలు తారుమారు చేయడం లేదా సాక్షులను ప్రభావితం చేయడం వంటి అంశాలు కేజ్రీవాల్ చేసే అవకాశం లేదని, అందువల్ల అండర్‌టేకింగ్ సమర్పించడం సరైనదేనని ప్రశాంత్ భూషణ్ వాదించారు.

అయితే, వారి వాదనలను గడ్కరీ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ పింకీ ఆనంద్ వ్యతిరేకించారు. ఇలా అండర్‌టేకింగ్ సమర్పించడం చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానమేనని, ఆప్ నేత బెయిల్ బాండ్ సమర్పించాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఏ వ్యక్తి అండర్‌టేకింగ్ సమర్పించకూడదని కూడా చట్టంలో లేదని మెహ్రా వాదించారు. ఈ దశలో మేజిస్ట్రేట్ జోక్యం చేసుకుంటూ.. ‘‘మీరు అండర్‌టేకింగ్ ఇస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ కేసులో మాత్రమే మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆమ్ ఆద్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నందున మీరు ఓ సామాన్యుడిలాగే వ్యవహరిస్తారని మేం ఆశిస్తాం. చట్టంలో అనుసరించే ప్రక్రియ కూడా అందరికీ ఒకేలా ఉంటుంది.

బెయిల్ బాండ్ సమర్పించడానికి ఏమైనా సమస్య ఉందా’’ అని ప్రశ్నించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, తానేమీ నేరానికి పాల్పడలేదని కేజ్రీవాల్ బదులిచ్చారు. ‘‘మేం అండర్‌టేకింగ్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఈ సౌకర్యాన్ని నాకు ఒక్కడికే ఇవ్వాలని కోరడంలేదు. అందరికీ దీన్ని కల్పించండి’’ అని పేర్కొన్నారు. అయితే ఆయన వాదనలతో న్యాయమూర్తి విభేదించారు. ఇది పరువునష్టం కేసు అని, ఇందులో ప్రక్రియలను మార్చలేమని స్పష్టంచేశారు. పైగా ఆర్థిక పరిస్థితులరీత్యా బెయిల్ బాండ్ సమర్పించడానికి వీలు లేని పరిస్థితులు ఈ కేసులో లేవని వ్యాఖ్యానించారు. ఈ కారణాల నేపథ్యంలో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుని ఈనెల 23 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆప్ నేతల్లో కలకలం
కేజ్రీవాల్ అరెస్టు అయ్యారనే వార్త తెలియడంతో ఆప్ నేతల్లో కలకలం రేగింది. దీంతో వారు వెంటనే పాటియాలా కోర్టు కాంప్లెక్స్‌కు క్యూకట్టారు. ఆప్ నేతలు సంజయ్‌సింగ్, గోపాల్ రాయ్, అశుతోష్, నాగేందర్ శర్మ, ఆశిష్ తల్వార్, దిలీప్ పాండ తదితరులు పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. కేజ్రీవాల్ ఏమీ దారుణమైన నేరానికి పాల్పడలేదని, కేవలం రూ.10వేల బెయిల్ బాండ్ మాత్రమే సమర్పించబోనన్నారని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంలో ఇది తమ మార్గమని వారు స్పష్టంచేశారు.


నేలపైనే పడక...: కేజ్రీవాల్‌ను తీహార్ జైలు తరలించిన తర్వాత తొలుత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఆయన్ను నాలుగో నంబర్ జైలులో ఉంచుతామని, నేలపైనే పడుకుంటారని పేర్కొన్నారు. జైలులో ఖైదీలందరికీ ఇచ్చినట్టే సాధారణ ఆహారాన్నే ఆయనకు కూడా ఇస్తారని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మందులు తీసుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమతిస్తామని జైలు అధికారులు వెల్లడించారు. కాగా, తీహార్ జైలు ముందు ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టి 144 సెక్షన్ విధించారు.

మరిన్ని వార్తలు