మెకల్లమ్ వాంగ్మూలం ఎలా లీకైంది? | Sakshi
Sakshi News home page

మెకల్లమ్ వాంగ్మూలం ఎలా లీకైంది?

Published Thu, May 22 2014 1:07 AM

ICC to Investigate Brendon McCullum's Testimony Leak

విచారణ చేపట్టిన ఐసీసీ
 దుబాయ్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీఎస్‌యూ) ముందు ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై ఐసీసీ విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంలో మెకల్లమ్‌పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కివీస్ బ్యాట్స్‌మన్ ఈ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ‘వాంగ్మూలం అంశం చాలా సీరియస్ విషయం.
 
 తక్షణ విచారణ జరిపేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటాం. ఇంత రహస్య అంశం మీడియాకు ఎలా చేరిందో కనిపెడతాం. ఏదేమైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో భరోసా నింపాల్సిన అవసరం ఉంది. ఏసీఎస్‌యూపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఆట సమగ్రతను కాపాడతాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్ వ్యాఖ్యానించారు.
 
 వాంగ్మూలం లీక్ విషయంలో మెకల్లమ్‌పై ఎలాంటి విచారణ జరపబోమని చెప్పిన ఆయన మరో క్రికెటర్ లూ విన్సెంట్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. క్రికెట్‌ను క్లీన్‌గా ఉంచేందుకు ఏసీఎస్‌యూ అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఐసీసీకి చెందిన ప్రాంతాల్లో స్థానిక చట్టాలు, దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయడానికి అవసరమైన లింక్‌లను ఏసీఎస్‌యూ అభివృద్ధి చేసుకుందని వెల్లడించారు. అవసరమైనప్పుడు ప్రభుత్వేతర సంస్థలు, న్యాయస్థానాలను కూడా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఏదేమైనా అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని సీఈఓ స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement