యాపిల్ వచ్చేస్తోంది!

19 May, 2016 01:34 IST|Sakshi
యాపిల్ వచ్చేస్తోంది!

బెంగళూరులో ఏర్పాటు కానున్న ‘యాపిల్’ డెవలప్‌మెంట్ సెంటర్
ఐటీ నగరికి మరో మణిహారం
2017నాటికి అందుబాటులోకి    తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు
మరిన్ని స్టార్టప్‌ల ఏర్పాటుకు ఊతం

 

బెంగళూరు:  భారతదేశ సిలికాన్ సిటీ, ఐటీ నగరి  బెంగళూరు సిగలో మరో మణిహారం చేరనుంది. టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే రారాజుగా వెలుగొందుతున్న ‘యాపిల్’ తన ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్’ను బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని యాపిల్ సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌లోని యువ ఇంజనీర్‌లకు అప్లికేషన్స్ రూపకల్పనకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను ఈ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్  ద్వారా ‘యాపిల్’ అందజేయనుంది. ఇక యువ డెవలపర్స్ రూపొందించిన అప్లికేషన్స్‌కు తన ఐఓఎస్ ప్లాట్‌ఫామ్ పై స్థానాన్ని కల్పించనుంది. ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్’ను 2017 నాటికి బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా యాపిల్ సంస్థ  ప్రణాళికలు రచిస్తోంది. ‘యాపిల్’ డిజైన్ సెంటర్ బెంగళూరులో అందుబాటులోకి వస్తే ఐటీ రంగంలో బెంగళూరు ఘనత దేశ వ్యాప్తంగా మరింతగా పెరగనుంది. ఇదే సందర్భంలో బెంగళూరులో ఐటీ రంగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.


ఇప్పటికే ఐటీ హబ్, స్టార్టప్‌ల రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు నగర ప్రతిష్ట మరింత ఎత్తుకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సందర్భంలో బెంగళూరులో మరిన్ని స్టార్టప్‌ల ఏర్పాటుకు సైతం ఈ పరిణామం ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ సెంటర్‌లో యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అప్లికేషన్స్‌ను(యాప్స్‌ను) తయారు చేసే డెవలపర్స్‌కు  ‘యాపిల్’ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. దీంతో అప్లికేషన్ డెవలపర్స్‌కు సంబంధించి ప్రపంచం మొత్తం బెంగళూరు వైపు చూడబోతోందనడంలో ఎటువంటి సందేహం లేదని నగరానికి చెందిన పారిశ్రామిక వేత్తలు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు