ప్రజలు సహకరించాలి

26 Apr, 2015 23:05 IST|Sakshi

- స్కూళ్ల వద్ద పొగాకు విక్రయాల నియంత్రణపై విద్యా మంత్రి
- అత్యధికంగా దానికి బానిసలవుతున్నది 15 ఏళ్లలోపు వారేనని వెల్లడి
- 10 నిమిషాల నిడివి ఉన్న లఘ చిత్రం విడుదల
- ఘనంగా ఐసీఎస్ వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, ముంబై:
పాఠశాల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడానికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల  సహాయం అవసరమని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే అభిప్రాయపడ్డారు. శనివారం ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ఐసీఎస్) అనే ఎన్జీవో సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పొగాకు వ్యతిరేక చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పొగాకు వ్యతిరేక చట్టాన్ని అమలు చేసేందుకు ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.

పాఠశాల ఆవరణలో 90 మీటర్ల మేర పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించినట్లు తెలిపారు. అయినా కొందరు విక్రయాలను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. దీంతో పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరిగితే నివేదిక సమర్పించాల్సిందిగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్స్ (పీటీఏఎస్) సభ్యులకు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. విద్యా శాఖకు వీరు ఫోన్లు లేదా ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ మాట్లాడుతూ.. తాను 15 ఏళ్ల వయస్సులో ధూమపానానికి అలవాటు పడ్డానని, తరువాత స్నేహితుల సాయంతో వదిలించుకున్నానని తెలిపారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా రూపొందించిన 10 నిమిషాల నిడివి ఉన్న ఓ లఘు చిత్రాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. ఐసీఎస్ లెక్కల ప్రకారం.. పొగాకు వినియోగానికి బానిసలైన వారిలో సగం మంది 15 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారని తేలింది. ప్రతి ఏడాది పొగాకుకు బానిసలై దాదాపు మూడు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. గన నాలుగేళ్లుగా 1,320 మంది క్యాన్సర్ రోగులకు ఎన్జీవో సంస్థ సహాయాన్ని అందజేసింది. ఇందులో 196 మంది రాష్ట్రానికి చెందినవారు ఉండగా, 249 మంది బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు.

మరిన్ని వార్తలు