రాష్ట్రం మారినా రాత మారలే..

2 Jun, 2015 00:35 IST|Sakshi
రాష్ట్రం మారినా రాత మారలే..

ఇదీ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల పరిస్థితి
* వలస వాదులపై కనీస దృష్టి కేంద్రీకరించని ప్రభుత్వం
* అ‘సమగ్ర సర్వే’తోనూ దక్కని ప్రయోజనం

సాక్షి, ముంబై: దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు సైతం తమవంతు పాత్ర పోషించారు. కాని ఎవ్వరికీ పైసా ప్రయోజనం ఒరగలేదు.

రాష్ట్రం వచ్చిందన్న సంతోషం తప్పిస్తే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. రాష్ట్ర అవతరణ అనంతరం అధికారాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ భవన్ ఏర్పాటు, వలసవాదుల కోసం పథకాలు, రైలు, బస్సు సేవలువంటి వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మిక సమస్యలు అలానే ఉండిపోయాయి. రేషన్‌కార్డులు, పెన్షన్లు వంటి విషయాల్లో తెలంగాణకు చెందిన ముంబైలోని కూలీలకు దక్కిందంటూ ఏమీలేదు.
 
అసమగ్ర సర్వే..
మరోవైపు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి ముంబై వాసులను నిరాశపరిచింది. పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చిన అనేక మంది తెలంగాణ వలసబిడ్డలు ఉన్న ఫలంగా అప్పులు చేసి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. తాము తెలంగాణ వారిమేనని పేర్లు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లారు. కాని చాలా మంది పేర్లు ఇప్పటికీ నమోదు కాలేదంటే అతిశయోక్తికాదు. నాలుగు నెలలు ఇక్కడ నాలుగు నెలలు అక్కడ ఉండే కూలీలు ప్రధానంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లోనూ మహారాష్ట్రలోని వారు ఓటు వినియోగించుకుని ప్రభుత్వ ఏర్పాటులో భాగమయ్యారు.
 
ప్రత్యేక తెలంగాణ కోసం...
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని వారిలానే ముంబైలోని వలస ప్రజలు కూడా తమవంతు కృషి చేశారు. అనేక కార్యక్రమాలతో తెలంగాణవాదులను చైతన్యపరిచారు. గోరేగావ్‌లో 2007 జనవరిలో జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమంతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. 2008లో దాన్ని మరింత ఉధృతం చేశారు. ఇదే ఏడాది తెలంగాణ వాదులు అనేక సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు.

ముంబై టీఆర్‌ఎస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ముంబై తెలంగాణ బహుజన ఫోరం క్రియాశీల పోషించింది. ఉద్యమాన్ని కలసి చేయాలనే ఉద్దేశంతో తెలుగు సంఘాలన్నీ ఏకమై ‘తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’గా ఏర్పాటయ్యాయి. ఆజాద్ మైదానంలో నిరాహారదీక్షలు చేపట్టారు. గోరేగావ్‌లో 2013 నవంబరులో జరిగిన తెలంగాణ సాధన సభ ఓ కొత్త ఊపునిచ్చింది.
 
మా కష్టాలు మాత్రం తీరలేదు
‘తెలంగాణ ఏర్పడి ఏడాది అవుతోందన్న సంతోషం ఉంది. కాని మా కష్టాలు మాత్రం తీరడం లేదు. మేం తూర్పు భాండూప్‌లోని శ్యాంనగర్ మురికివాడలో నివసిస్తున్నాం. మాతోపాటు ఇక్కడ సుమారు 100 పైగా తెలుగువారి ఇళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన చాలామంది పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చినవారే. గత మూడు దశాబ్దాలకుపైగా భాండూప్ శ్యాంనగర్‌లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. చాలా సార్లు మా గుడిసెలను కూల్చివేశారు. అన్ని ఆధారాలున్నా మాకు అన్యాయం జరుగుతోంది. ముంబైలోని తెలుగు సంఘాలు, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మా గోడును వినిపించుకోవాలి.    
- ముస్తఫా, మహబూబ్‌నగర్
 
సంతలో సరుకుల లిస్టులా...
‘తెలంగాణ ఏర్పడితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఇక వలస వెళ్లే వారే ఉండరని, వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి స్వస్థలాల్లో ఉపాధి పొందుతూ బతకొచ్చని ఎంతగానో ఊదరగొట్టారు. తర్వాత అవి జరగాలంటే సమగ్ర సర్వేలో కుటుంబ సభ్యులంతా పాల్గొనాలన్నారు. అందరం అన్ని సర్దుకొని ఊరికి పోయాం. సంతలో కొనుగోలు చేసే సరుకుల లిస్ట్ మాదిరిగా అధికారులు రాసుకున్నారు. అంతకు మినహా ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర లేదు. పూర్వ ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. ప్రజల పాట్లు ఎప్పటి లానే ఉన్నాయి.’
- దాసరి లక్ష్మి నారాయణ, కరీంనగర్

మరిన్ని వార్తలు