అప్పుడు కార్తీక చంపేసేదేమో

24 Apr, 2015 02:48 IST|Sakshi

నటి కార్తీక తనను కారులోనే చంపేసేవారని, టైమ్ బాగుండి ప్రాణాలు దక్కించుకున్నట్లు నటుడు అరుణ్ విజయ్ అన్నారు. ఎన్నై అరిందాల్ చిత్రంతో రీ ఎంట్రీ అవడంతో పాటు విలన్‌గా అవతారమెత్తిన ఈయన ఆ చిత్రంలో విక్టర్ పాత్రలో నటించి అనంతరం నిజ జీవితంలోను విక్టర్‌గా పిలుచుకునే గుర్తింపు పొందారు. అలాంటి అరుణ్‌విజయ్ హీరోగా నటించిన చిత్రం వా. ఫెరర్ టచ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి దత్తన్ శివ దర్శకత్వం వహించారు. కార్తీక కథా నాయకిగా నటించిన వా చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలో గల ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
 
  ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ వా చిత్రం గురించి చెప్పాలంటే చాలా అనుభవాలున్నాయన్నారు. చిత్ర ప్రారంభం రోజున హీరోయిన్ కార్తీక తనను నటుడు సతీష్‌ను కారులోనే చంపేసే దుస్సంఘటన జరిగిందన్నారు. ఆమె డ్రైవ్‌చేస్తున్న కారులో తాము ప్రయాణం చేసే సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరణకు సిద్ధం అయ్యారన్నారు. అంతా రెడీ అయిన తరుణంలో కార్తీక తనవద్దకు వచ్చి కారు బ్రేక్ వేయడం ఎలా అని అడిగారన్నారు. దీంతో తనకు షాక్ తగిలినంత పనైనందన్నారు. దర్శకుడు విషయం చెప్పగా ఆమె జోక్ చేసి వుంటారని, కారు డ్రైవింగ్ కార్తీకకు తెలుసు అని అన్నారన్నారు. మరో విషయం ఏమిటంటే కార్తీక కారు నడపాలన్న విషయాన్ని దర్శకుడు ముందుగానే ఆమె తల్లి రాధకు వివరించారన్నారు.
 
 ఆమె కూడా కార్తీకకు డ్రైవింగ్ వచ్చని చెప్పడంతో దర్శకుడు తనకు భరోసా ఇచ్చారన్నారు. తీరా షాట్‌లో బ్రేక్ వేయాల్సిన కార్తీక ఎక్సలేటర్‌పై కాలు వేశారన్నారు. దీంతో కారు దాని ఇష్టానికి పరుగులు తీసిందని అన్నారు. కాస్త ఆలస్యంగా తేరుకున్న తాను స్టీరింగ్ చేత తీసుకుని కారును అదుపులోకి తీసుకొచ్చానని తెలిపారు. ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా భయానక పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చేదని అరుణ్ విజయ్ అన్నారు. వా చిత్రం సంతృప్తికరంగా వచ్చిందని త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు