ఓల్వో బస్సు బోల్తా

4 Dec, 2014 01:42 IST|Sakshi
ఓల్వో బస్సు బోల్తా

డ్రైవర్ మృతి - 16 మందికి గాయాలు
ముందు చక్రం పగిలి ప్రమాదం

 
చెన్నేకొత్తపల్లి (అనంతపురం) : స్థానిక 44వ జాతీయ రహదారిపై కర్ణాటక రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ)కు చెందిన ఓల్వో బస్సు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. మరో 16 మంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు... హైదరబాద్ నుంచి బెంగళూరుకు 20 మంది ప్రయాణికులతో బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీకి చెందిన ఓల్వో బస్సు(కేఏ 01ఎఫ్9164) చెన్నేకొత్తపల్లి వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంది. వై జంక్షన్ వద్దకు చేరుకోగానే బస్సు ముందు కుడివైపున ఉన్న టైర్ బద్ధలైంది. ఘటనతో వాహనం డ్రైవర్ అదుపుతప్పి కుడివైపు నుంచి రోడ్డు మధ్యన డివైడర్‌ను దాటి ఎడమవైపు రోడ్డుపై దూసుకొచ్చి బోల్తాపడింది. ఘటనలో బస్సు నడుపుతున్న డ్రైవర్ సిద్దప్ప(32) అక్కడికక్కడే మరణించాడు.

డివైడర్‌ను ఢీకొన్న సమంయలో బస్సు ముందు భాగంలోని అద్దం పగిలి అందులో నుంచి అతను ఎగిరి కిందపడ్డాడు. ప్రయాణికుల్లో 16 మంది గాయపడ్డారు. విషయాన్ని గుర్తించిన సమీపంలోని డాబాలో ఉన్న వారు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ధర్మవరం, అనంతపురం, చెన్నేకొత్తపల్లిలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండవ డ్రైవర్ అనిల్, హైదరాబాద్‌కు చెందిన రామయ్య, లక్ష్మి, ప్రవలిక, లక్ష్మి తల్లి జయమ్మతో పాటు నల్గొండ జిల్లా కేశాపురానికి చెందిన ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఘటనపై ఎస్‌ఐ రామాంజనేయులు దర్యాప్తు చేపట్టారు.
 
 

>
మరిన్ని వార్తలు