దొంగ అవతారమెత్తిన ఆర్‌ఎంపీ | Sakshi
Sakshi News home page

దొంగ అవతారమెత్తిన ఆర్‌ఎంపీ

Published Thu, Dec 4 2014 1:41 AM

turning thief

వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్‌ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. తన అన్నతమ్ముడిలాగే తానూ చోరీల బాటపట్టి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం.. రామగుండం మండలం రామారం గ్రామానికి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ ఉరఫ్ రాజు ఆర్‌ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు.
 
 గతంలో ఆదిలాబాద్, కరీంనగర్‌లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మే నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆర్‌ఎంపీగా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు.  8 తాళం వేసిన ఇళ్లలో.. మరో 10 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. చోరీ సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్‌లో అమ్ముకునేందుకు రాజ్‌కుమార్ రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆది నారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగారం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సారయ్య పరారీలో ఉన్నాడు.
 

Advertisement
Advertisement