మాట్లాడు కన్నా..

26 Aug, 2018 01:28 IST|Sakshi

హలో.. హలో.. మెత్తగా ఉన్నాయి కౌన్సిలర్‌ మాటలు. అవతలి నుంచి స్పందన లేదు. అనునయించినా అవతలి వైపు చిన్నారి గొంతు పెగల్లేదు. వెనుక నుంచి ఏవో శబ్దాలు... మూగ రోదన.. సాయం కోసం మౌన అభ్యర్థన...!
ఆ మౌనాన్ని బద్దలు కొట్టేందుకు ఆమె ప్రయత్నించింది.
అంతలోనే ఫోన్‌ కట్‌. మరోసారి కాల్‌ రావొచ్చని ఎదురుచూస్తోంది కౌన్సిలర్‌. 

చైల్డ్‌లైన్‌ కేంద్రాల్లో ఇలాంటి అనుభవాలు సాధారణం. 2017–18లో చైల్డ్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1098కి వచ్చిన ఇలాంటి సైలెంట్‌ కాల్స్‌ సంఖ్య 53 లక్షలు. 2015 ఏప్రిల్‌– 2018 మార్చి మధ్య.. అంటే మూడేళ్ల వ్యవధిలో చెల్డ్‌లైన్‌కి వచ్చిన మొత్తం కాల్స్‌ సంఖ్య ఎంతో తెలుసా 3.4 కోట్లు. ఇందులో సైలెంట్‌ కాల్స్‌ 1.36 కోట్లు. ఆ కాల్‌ చేసింది పిల్లలు కావొచ్చు.. పెద్దలూ కావొచ్చు. వారి పిలుపు వెనుక ఆపద ఉంది. నిస్సహాయత ఉంది. హింస ఉంది. ఊహకందని కోణాలు మరెన్నో ఉండొచ్చు. అందుకే వాటిని తీవ్రంగా పరిగణిస్తామంటున్నారు చైల్డ్‌లైన్‌ ఫౌండేషన్‌ ఇండియా ప్రతినిధి హర్లీన్‌ వాలియా.  

భరోసా  ఇవ్వాలి...
సాధారణంగా మొదటిసారి గొంతు విప్పే పిల్లలు అరుదే. కౌన్సిలర్‌ వారిలో విశ్వాసం నెలకొల్పాలి. నీకు ‘మేమున్నాం’ అనే భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే వారు గుండె గొంతుక విప్పగలుగుతారని చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేందుకు.. గూడుకోసం, మాయమైపోయిన పిల్లల కోసం కాల్‌ చేసే వారు ఎక్కువే. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, కుటుంబాల్లో కల్లోల వాతావరణం వల్ల సంక్షోభంలో చిక్కుకుపోయిన పిల్లలు (వారి తరపు పెద్దలు) కూడా మనోబలాన్ని కూడగట్టుకునేందుకు అవసరమైన మాట సాయం కోసం.. చైల్డ్‌లైన్‌ సేవలను ఆశిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ధనిక కుటుంబాలకు చెందిన వారు. ఈ తరహా మద్దతు ఆశించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఇలాంటి సాయం కోరుతూ అందిన 66 వేలకు పైగా కాల్స్‌కు చైల్డ్‌లైన్‌ స్పందించింది. బాధితులకు మనోబలం ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. మూడేళ్లలో రకరకాల వేధింపుల బారినపడ్డ 2,08,496 కాలర్లు చైల్డ్‌లైన్‌ సాయం తీసుకున్నారు. పిల్లలు అదృశ్యమైపోయిన (మిస్సింగ్‌) ఘటనలకు సంబంధించి అందిన 56,456 కేసుల్లో చైల్డ్‌లైన్‌ ఫౌండేషన్‌ ఇండియా జోక్యం చేసుకుంది. మొత్తం ఆరు లక్షలకు పైగా కేసుల్లో తన సేవలందించింది.  

మరిన్ని వార్తలు