మామ ఇంటికే కన్నం..

18 Jan, 2015 13:46 IST|Sakshi

గోల్నాక: ఇంటి తాళం పగులగొట్టి కిలో 50 గ్రాముల  బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వి.రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ దీరావత్ హుస్సేన్ వివరాలను వెల్లడించారు.

ఓల్డ్ సంతోష్‌నగర్ జీఎంనగర్‌కు చెందిన సయ్యద్ ఒమర్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. మలక్‌పేట కాలడేరాలో నివాసముండే ఒమర్ అతడి మామ మహ్మద్ అబ్దుల్ రహీంఖాన్ ఇంటిని టార్గెట్ చేసుకున్నారు. గత సంవత్సరం ఆగస్టు 30న రహీంఖాన్ కోడలు ఫాతిమా జబీన్ కువైట్ నుంచి వస్తుండటంతో, కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఇదే అదునుగా సయ్యద్ ఒమర్ తన స్నేహితుడు సయ్యద్ తారిఖ్ మొయినుద్దీన్‌ను రహీంఖాన్ వెంట పంపాడు. మొయినుద్దీన్ ఎప్పటికప్పుడు రహీం ఖాన్ వివరాలను ఫోన్ ద్వారా ఒమర్‌కు తెలియజేస్తున్నాడు. రహీంఖాన్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని కిలో 50 గ్రాముల బంగారు ఆభరణాలను, నగదును చోరీ చేశాడు.

ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రహీంఖాన్ చోరీపై చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు బంగారు ఆభరణాలను సంతోష్‌నగర్‌లోని వైశ్యా బ్యాంకులో తనఖా పెట్టి రూ.12 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 16వ తేదీన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి కిలో 50 గ్రాముల బంగారు ఆభరణాలు,  బైక్, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన చాదర్‌ఘాట్ పోలీసులను డీసీపీ అభినందించారు.

>
మరిన్ని వార్తలు