చిన్నారికి ఎంత కష్టమో..

27 Oct, 2016 00:29 IST|Sakshi
చిన్నారికి ఎంత కష్టమో..

తమ్ముడిని వెంట బెట్టుకుని బడికి.. తల్లి కూలికి..
 
 అలంపూర్ రూరల్: చిన్నారి వయస్సు నాలుగేళ్లు.. ఒళ్లో తమ్ముడు.. చేతిలో పలకాబలపం.. అప్పుడప్పుడు పాలు పడుతూ ఏడిస్తే అమ్మపాట పాడుతుంది. ‘అమ్మ పనికి వెళ్లింది.. వస్తుంది’ అంటూ సముదాయిస్తుంది. అసలు విషయానికి వస్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన లక్ష్మన్న, సుశీల దంపతులు. లక్ష్మన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 11 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రూతు(10), మౌనిక(4), 10 నెలల వయసు గల ఆనంద్ వారి సంతానం. అతని మరణానంతరం పిల్లలను పోషించేందుకు సుశీల కూలిబాట పట్టింది.

పెద్దకూతురు రూతును గట్టులోని ప్రభుత్వ హాస్టల్‌లో 5వ తరగతిలో చేర్పించింది. 4 ఏళ్ల వయసు గల మౌనికను, 11 నెలల వయసు గల పసిబిడ్డను స్థానికంగా ఉన్న న్యూ ప్లాట్స్ ప్రభుత్వ పాఠశాలలో వదిలి కూలికి వెళుతోంది. దీంతో ఆ 10 నెలల తమ్ముడి ఆలనాపాలనా చూసే భారం మౌనికపై పడింది. పిల్లాడు ఏడ్చిన ప్రతిసారీ.. మౌనిక సముదాయించలేక.. మరోవైపు అక్షరాలు దిద్దుకోలేక కన్నీటి పర్యంతమవుతోంది. పాపం ఆ చిన్నారి డ్రాపవుట్ అయ్యే ప్రమాదముందని హెచ్‌ఎం శ్రీలత, ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనికది కూడా చిన్న వయసు అని, ఆ చిన్నారే తల్లిచేత గోరు ముద్దలు తినాల్సిన పసి వయసులో 10 నెలల తన తమ్ముడి ఆలనాపాలనా చూసుకోలేక పడుతున్న కష్టం చూసి ఉపాధ్యాయులే ఓదార్పునిస్తున్నారు.

మరిన్ని వార్తలు