ఒక్కరోజే.. 2.25 లక్షల మంది మెట్రో జర్నీ

2 Jan, 2019 04:16 IST|Sakshi

ప్రయాణికుల సంఖ్య 2 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి

నెలాఖర్లోగా అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో పరుగులు

అప్పుడు మూడు లక్షలు దాటనున్న రోజువారీ ప్రయాణికులు

సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించ డం వల్ల ఒకేరోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడిపారు. దీని కారణంగా ఒకేరోజు మెట్రోలో ప్రయాణించిన వారిసంఖ్య తొలిసారి 2 లక్షల మార్క్‌ను దాటిందని హెచ్‌ఎమ్మార్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో 1.65 లక్షల మంది, నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గంలో సుమారు 60 వేల మంది మెట్రో ప్రయా ణం చేసినట్లు ఆయన వెల్లడించారు. అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, ఉప్పల్‌ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయన్నారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గం. వరకు ఈ రద్దీ కొనసాగిందన్నారు.  

ఆరు నిమిషాలకో రైలు: రోజూ 1.50 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎల్బీనగర్‌–మియాపూర్, అమీర్‌పేట్‌–నాగోల్‌ రూట్లలో ప్రతి ఆరు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. జనవరి నెలాఖరులోగా అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ (10 కి.మీ)రూట్లోనూ మెట్రోరైళ్ల వాణిజ్య రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గం ప్రారంభమయితే.. నిత్యం నగరంలో మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటుతుందని మెట్రోరైల్‌ అధికారులు అంచనావేస్తున్నారు. హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పూర్తయితే ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పనున్నాయి. ఈ రూట్లోని స్టేషన్ల నిర్మాణం, సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మార్గం కూడా పూర్తయితే నిత్యం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తారని మెట్రో అధికారులు అంచనావేస్తున్నారు.  

మరిన్ని వార్తలు