పగలూ గజగజ

2 Jan, 2019 04:22 IST|Sakshi

రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

నేడు, రేపు చలిగాలులు వీచే అవకాశం 

కోహిర్‌లో అత్యల్పంగా 2.9 డిగ్రీలు

సాక్షి, హైదరాబాద్‌/కోహిర్‌ (జహీరాబాద్‌): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతు న్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గం. వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో మంగళవారం ఉదయం రికార్డు స్థాయిలో 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టీ), జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో 3.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.

ఇక కోహిర్‌ మండలానికి పక్కనే ఉన్న మర్పల్లి, ఆసిఫాబాద్‌ జిల్లా కొమురంభీం మండలం గిన్నెధారిలో 3.8 డిగ్రీల æచొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిరిపూర్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 4.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి, వికారాబాద్‌ జిల్లా నాగారంలో 4.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

రెండ్రోజుల పాటు చలిగాలులు.. 
ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ రెండ్రోజులు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, నిజామా బాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు