పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

17 Dec, 2019 10:27 IST|Sakshi
 సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ నర్సింహారెడ్డి

నేటి నుంచి ఓరుగల్లులోని కేయూ ఆడిటోరియంలో

హాజరుకానున్న 2 వేల మంది ప్రతినిధులు 

రెండో రోజు ప్రసంగించనున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, వరంగల్‌: జై భారత్‌.. జై జవాన్‌.. జై కిసాన్‌ నినాదంతో విద్యారంగ సమస్యలు, వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధరలు తదితర సామాజిక సమస్యలపై చర్చించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వరంగల్‌లోని కేయూ ఆడిటోరియం వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలో 2008 లో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు  వరంగల్‌ వేదికగా నిలుస్తోంది.

రెండు వేలమంది ప్రతినిధులు..
కేయూలో మంగళవారం నుంచి నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన రెండు వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 8లక్షల సభ్యత్వం కలిగిన ఏబీవీపీలో రాష్ట్ర, జిల్లా, మండల, కళాళాశాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారు. వీరి కోసం కేయూలో పలుచోట్ల వసతి ఏర్పాట్లు చేశారు.

చర్చించనున్న అంశాలు ఇవే..
రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలల మూసివేత, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగుల ఖాళీలు, వీసీల భర్తీలో ఆలస్యం, ప్రైవేట్‌ యూనివర్సిటీలకు అనుమతి, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాల కల్పన, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు.

మొదటిరోజు కేవలం జెండా ఆవిష్కరణ..
నాలుగు రోజుల పాటు జరిగే ఏబీవీపీ మహాసభల్లో భాగంగా మంగళవారం తొలిరోజు సాయంత్రం 6గంటలకు సభాప్రాంగణం వద్ద ఏబీవీపీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మీసాల ప్రసాద్‌.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌తో కలిసి ఆవిష్కరిస్తారు. ఏబీవీపీ ప్రముఖ్‌ మాసాడి బాబురావు పాల్గొంటారు. ఇక రెండో రోజైన బుధవారం రాష్ట్ర మభసభలను ఉద్ధేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఏబీవీపీ జాతీయ సంఘటసహాకార్యదర్శి కేఎన్‌ రఘునందన్‌ పాల్గొననుండగా.. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం 3గంటలకు  కేయూ నుంచి ఏకశిలా పార్కు వరకు శోభాయాత్రగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి,న్‌రాష్ట్ర నూతన అధ్యక్షడు శంకర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. 

మహాసభలను విజయవంతం చేయాలి..
కేయూలో మంగళవారం నుంచి జరగనున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని స్వాగత సమితి అధ్యక్షుడు డాక్టర్‌ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కేయూలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా విద్యారంగ, సామాజిక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల కన్వీనర్‌ ఏలేటి నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, కేయూ అధ్యక్షుడు చట్ట సతీష్, నగర కార్యదర్శి భరత్‌ పాల్గొన్నారు.

1970 దశకం నుంచే ఏబీవీపీ..
స్వాతంత్రనంతం 1949, జూలై 9న ఐదుగురు విద్యార్థులతో ప్రొఫెసర్‌ బెహల్‌ ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970 దశకం నుంచి ఎక్కువగా ఏబీవీపీ విస్తరణ యూనివర్సిటీల్లో జరిగింది. అప్పటి నుంచే వరంగల్‌ ప్రాంతంలోనూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 1982లో కేయూలో జాతీయ జెండాకు అవమాన జరిగిందంటూ సామ జగన్మోహన్‌రెడ్డి న్యాయపోరాటం చేస్తూ అసువులు బాశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ విద్యారంగ, సామాజిక సమస్యలపై పోరాడుతోంది.

మరిన్ని వార్తలు