కల్తీ నెయ్యి గుట్టురట్టు

4 Jun, 2015 02:30 IST|Sakshi

120 టిన్‌ల డూప్లికేట్ నెయ్యి స్వాధీనం
అబిడ్స్:
కల్తీ నెయ్యి తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ టీమ్ పోలీసులు, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా బుధవారం డూప్లికేట్ నెయ్యి తయారీ కేంద్రం, గోడౌన్లపై దాడులు చేసి రూ.3 లక్షల విలువైన కల్తీని నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రామకృష్ణ కథనం ప్రకారం... షాహినాయత్‌గంజ్, బేదర్‌వాడీలతో పాటు మంగళ్‌హాట్ సీతారాంపేటలో నారాయణగూడకు చెందిన సచిన్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్ నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. 15 కిలోల టిన్‌ల్లో 1.5 కిలోల ఒరిజినల్ నెయ్యి, 13.5 కిలో డాల్డా, పామాయిల్ కలిసి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు.

ప్యాకెట్లు, డబ్బాలకు విజయ, కృష్ణ, మహదేవ్ తదితర బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి అసలు కంపెనీల నెయ్యిగా విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నెయ్యిని షాహినాయత్‌గంజ్, బేదర్‌వాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోడౌన్‌లకు తరలించి అక్కడి నుంచి షాపులకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు 120 టిన్‌ల్లో గల 2 వేల లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకొని సచిన్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు.  మరో నిందితుడు సంజయ్ అగర్వాల్ కోసం గాలిస్తున్నారు.  షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు