ఇక అక్రమ రవాణాకు ‘చెక్’

14 Sep, 2015 00:03 IST|Sakshi
ఇక అక్రమ రవాణాకు ‘చెక్’

- చిరాగ్‌పల్లిలో అధునాతన చెక్‌పోస్టు
- మహారాష్ట్ర ఉమర్గా తరహాలో నిర్మాణం
- 9 ఎకరాల భూ సేకరణ... ప్రక్రియ వేగవంతం
జహీరాబాద్:
రాష్ట్రంలోకి ఎంట్రీ ఒకటే... కానీ చెక్‌పోస్టులు రెండు. కళ్లముందు నుంచి వెళుతున్న వాహనం తనిఖీ చేశారో లేదో తెలియని అయోమయం. దీన్ని అవకాశంగా తీసుకొని కళ్లుగప్పి జారుకుంటున్న సరుకు రవాణా వాహనదారులు. వాణిజ్య పన్నుల శాఖ అవస్థలు అన్నీఇన్నీ కావు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వీటన్నింటికీ ‘చెక్’పెట్టేందుకు రంగం సిద్ధమయింది. తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల సరి హద్దులో అధునాతన సౌకార్యలతో జహీరాబాద్ సమీపంలోని చిరాగ్‌పల్లి వద్ద ‘సమీకృత చెక్‌పోస్ట్’ ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి.

జహీరాబాద్ సమీపంలోని చిరాగ్‌పల్లి వద్ద ఈ చెక్‌పోస్టును నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకు సర్వే నెం.87/2లో 9 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ కేటాయించింది. ప్రస్తుతం 65వ జాతీయ రహదారిని ఫోర్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నందున... గుర్తించిన ప్రాం తంలో రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తి కాగానే చెక్‌పోస్టుల నిర్వహణ కోసం అవసరమైన భవనాలను నిర్మిం చేందుకు వాణిజ్య పన్నులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
తనిఖీల్లో ఇబ్బందులు...
రెండున్నరేళ్ల కిందట ఈ చెక్‌పోస్ట్ నిర్మాణానికి వాణిజ్యపన్నుల శాఖ రూ.10 కోట్లతో ప్రతిపాదించింది. రాష్ట్ర సరిహద్దు గుండా రాకపోకలు సాగించే వాహనాల తనిఖీకి ఒకే చెక్‌పోస్టును వాణిజ్యపన్నుల శాఖ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 65వ జాతీయ రహదారిపై తగిన సౌకర్యాల లేకపోవడంతో సరిహద్దు దాటే వాహనాల తనిఖీ కోసం జహీరాబాద్ సమీపంలోని బీదర్ క్రాస్‌రోడ్డు వద్ద... రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాల తనిఖీ కోసం చిరాగ్‌పల్లి వద్ద వేరువేరుగా చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో గూడ్సు వాహనాల డ్రైవర్లు... సిబ్బంది కళ్లుగప్పి జారుకుంటున్నారు. వాటిని వెంబడిం చి తనిఖీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు చెక్‌పోస్టుల వద్ద గోదాములు లేకపోవడంతో పన్ను చెల్లించని వాహనాలను సీజ్ చేసిన పక్షంలో, వాటిలో సరుకు ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌పల్లిలో సమీకృత చెక్‌పోస్ట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ పడింది.
 
అన్నీ ఇక్కడే...
ఈ సమీకృత చెక్‌పోస్టులో ఆరు శాఖలకు సంబంధించిన చెక్‌పోస్టులుంటాయి. వాణిజ్యపన్నులు, రోడ్డు రవాణా, ఎక్సైజ్, మార్కెటింగ్, అటవీ, పోలీసు శాఖలకు సంబంధించిన చెక్‌పోస్టులు ఒకేచోట ఏర్పాటు చేస్తారు. వచ్చి పోయే గూడ్స్ వాహనాలను సంబంధిత శాఖల అధికారులు తనిఖీ చేస్తారు. ఇందు కోసం వాహనాల్లోని సరుకును తూచేందుకు రెండు వేబ్రిడ్జిలను సైతం నిర్మిస్తారు. వాహనాల్లోని సరుకు తనిఖీ చేసేందుకు అధునాతన స్కానింగ్ యంత్రాలు సమకూరుస్తారు. సీజ్ చేసిన వాహనాల్లోని సరుకును నిల్వ చేసేందుకు రెండు పెద్ద గోదాములను నిర్మిస్తారు. మూడు విడతలుగా పనిచేసే చెక్‌పోస్టు సిబ్బంది
 
కావల్సింది 20 ఎకరాలు...
కోసం విశ్రాంతి గదులు కూడా కడతారు. వాస్తవానికి సమీకృత చెక్‌పోస్టుకు సుమారు 20 ఎకరాల భూమి అవసరం ఉండగా... ప్రస్తుతం 9 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన భూమి కూడా సమకూర్చే పనిలో అధికారులున్నారు.
 
అక్కడలానే ఇక్కడా...
మహారాష్ట్ర సరిహద్దు ఉమర్గా వద్ద ఉన్న చెక్‌పోస్టులానే ఇక్కడ కూడా నిర్మించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ ఉన్నతాధికారులు అక్కడి చెక్‌పోస్టును పరిశీలించి వచ్చారు. మంత్రులు కూడా వెళ్లి పరిశీలిస్తారని సమాచారం. చెక్‌పోస్టు వద్ద 12 లైన్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది. దీనివల్ల వాహనాల చెకింగ్‌లు సులువుగా సాగుతాయన్నది అధికారుల ఆలోచన.

మరిన్ని వార్తలు