‘వక్ఫ్‌’ రికార్డుల డిజిటైజేషన్‌కే సీలు

17 Nov, 2017 04:23 IST|Sakshi

     కార్యాలయానికి సీలు వేయలేదు

     రికార్డులున్న గదులకే సీలు

     రెండు వారాల సమయం పడుతుంది

     హైకోర్టుకు విన్నవించిన అడ్వొకేట్‌ జనరల్‌

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌ బోర్డు ఆస్తులను రక్షించే చర్యల్లో భాగంగానే వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో రికార్డులున్న గదులకు సీల్‌ వేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. మొత్తం కార్యాలయానికి సీల్‌ వేయలేదని, రికార్డులున్న గదులకే వేశామని వివరించింది. కార్యాలయంలో రికార్డులను సీజ్‌ చేసి, కార్యాలయానికి సీలు వేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎం.ఎ.కె. ముఖీద్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

వక్ఫ్‌ కార్యాలయం మొత్తానికి సీలు వేయలేదని, రోజువారీ విధుల నిర్వహణకు ఇబ్బంది లేదని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రికార్డుల డిజిటైజేషన్‌ నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నామని, రికార్డుల క్రమబద్ధీకరణ, డిజిటైజేషన్‌ల కోసం ఆరుగురు అధికారులు పనిచేస్తున్నారని, రెండు వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వక్ఫ్‌ అధికారులతో ప్రభుత్వం చర్చించి, విధులకు ఆటంకం లేకుండా 14న మెమో ఇచ్చామని చెప్పారు.
 
దేవుడి ఆస్తులకు రక్షణ కరువు 
వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వక్ఫ్, దేవాదాయ ఆస్తులకు రక్షణ కొరవడుతోందని, వీటి రక్షణలో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యం లో వక్ఫ్‌  ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలుంటే మంచిదేనని పేర్కొంది. మణికొండలో ఆక్రమణలకు గురైంది వక్ఫ్‌ ఆస్తులేనని ధర్మాసనం గుర్తు చేసింది. రోజువారీ విధుల నిర్వహణకు సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని పిటిషనర్‌కు సూచన చేసింది. విచారణ వచ్చే మంగళవారానికి (21వ తేదీకి) వాయిదా పడింది.  

మరిన్ని వార్తలు