ఈ–నామ్‌లో తెలంగాణకు అగ్రస్థానం | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌లో తెలంగాణకు అగ్రస్థానం

Published Fri, Nov 17 2017 4:20 AM

Union Agriculture Department congratulated the minister harish rao - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. 18.71 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా జరిగిన ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గరిష్ట ధర పొందగలిగారు. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ–నామ్‌ను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది’అని కేంద్ర వ్యవసాయశాఖ ప్రశంసించింది.

దేశంలోనే ఈ–నామ్‌ అమలులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలను పోల్చుతూ తెలంగాణలో ఈ–నామ్‌ అమలు తీరును కేంద్రం తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదికను గురువారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావుకు పంపించింది. ఒడిశాలో ఈ–నామ్‌ మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా విక్రయించగా, తెలంగాణలో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారానే విక్రయించారని. ఏ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర వ్యవసాయశాఖ, మంత్రి హరీశ్‌రావును అభినందించింది.  

13 రాష్ట్రాలు.. 455 మార్కెట్లు..  
రైతుల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌) విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 455 మార్కెట్లలో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టగా, తెలంగాణలో 44 మార్కెట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు తాము పండించిన ధాన్యం, పళ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల వంటి ఉత్పత్తులను గరిష్ట ధరకు విక్రయించుకునే అవకాశం దీనివల్ల కలుగుతుంది. ఇలా 16 రకాల ధాన్యం, 14 రకాల నూనెగింజలు, 21 రకాల పళ్లు, 27 రకాల కూరగాయలు, 6 రకాల సుగంధ ద్రవ్యాలు, మరో ఆరు రకాల ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఈ–నామ్‌ ద్వారా రైతులు విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ–నామ్‌ మొదటి దశ అమలవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రైతులు, కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారస్తుల వివరాలను నమోదు చేశారు. ఇప్పటికి 44 మార్కెట్లలో 3,840 మంది కమీషన్‌ ఏజెంట్లు, 5,078 మంది వ్యాపారస్తులను నమోదు చేసి వారికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చారు. ఇప్పటివరకు 7.62 లక్షల మంది రైతులు ఈ–నామ్‌ ద్వారా తమ వ్యవసాయ ఉత్పత్తులు మెరుగైన ధరకు విక్రయించుకున్నారు. కాగా, 2018 మార్చి నాటికి ఈ–నామ్‌ ద్వారా ఒక రాష్ట్రం నుంచి వ్యాపారస్తుడు ఇంకో రాష్ట్రంలోని ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలుకల్పించనున్నారు. 

కొన్ని సమస్యలు ఉన్నాయి
ఈ–నామ్‌ అమల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం సంతోషకరం. అందరి కృషి ఫలితంగా దీన్ని సాధించాం. ఈ–నామ్‌ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సమస్యల వల్ల అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయాన్ని అనేకసార్లు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి విన్నవించా. వీటిని అధిగమించి ముందుకు వెళ్లగలమనే ఆత్మవిశ్వాసముంది. మన మార్కెటింగ్‌ చట్టానికి గతేడాది విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చాం. అందు లో భాగంగా రైతు ముంగిట్లో మార్కెట్లు ఏర్పాటు చేయనున్నాం. వారికి దగ్గరలోని గోదాములు, కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూ నిట్లను మార్కెట్లుగా ప్రకటిస్తాం. వీటిని వచ్చే ఏడాది ఈ–నామ్‌ మార్కెట్లుగా తయారుచేయాలన్నది మా ఉద్దేశం. 
– హరీశ్‌రావు, రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి  

Advertisement
Advertisement